తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంచుకొస్తున్న వాయుకాలుష్య భూతం..! - pollution article

మానవాళి తమ అవసరాల కోసం ప్రకృతి వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తున్నందున పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉంది. 153 దేశాలకు చెందిన 11,258 మంది సభ్యులతో కూడిన ‘ప్రపంచ శాస్త్రవేత్తల కూటమి’ తాజాగా ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. అడ్డూఅదుపు లేకుండా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నందున తాగే నీరు, పీల్చేగాలి, తినే ఆహారంతో సహా అన్నీ కలుషితమైపోతున్నాయి. ఉత్తర భారతంలోని దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయునాణ్యతా సూచీ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రాణవాయువుకే పెనుముప్పు

By

Published : Nov 12, 2019, 7:46 AM IST

పీల్చే గాలి విషతుల్యమై ప్రజల ప్రాణాలను హరించేలా వాయు నాణ్యతా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు ప్రబల నిదర్శనం. మానవాళి తమ అవసరాల కోసం ప్రకృతి వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తున్నందున పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉంది. 153 దేశాలకు చెందిన 11,258 మంది సభ్యులతో కూడిన ‘ప్రపంచ శాస్త్రవేత్తల కూటమి’ తాజాగా ఈ చేదునిజాన్ని వెల్లడించింది. అకాల వర్షాలు, వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, సునామీ, పెరుగుతున్న భూతాపం, వేగంగా కరిగిపోతున్న మంచు పర్వతాలు, పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల పర్యావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి అనేక దుష్ఫలితాలకు దారి తీస్తున్నాయి. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అభివృద్ధి పేరిట వనాల నరికివేత ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. తొలినాళ్లలో ఆహారం కోసం మానవుడు అన్వేషించేవాడు. నాగరికత పరిణామ క్రమంలో తన అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. అడ్డూఅదుపు లేకుండా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను వదిలేస్తుండటంతో తాగే నీరు, పీల్చేగాలి, తినే ఆహారంతో సహా అన్నీ కలుషితమైపోతున్నాయి.

ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది

ప్రాణవాయువుకే పెనుముప్పు

ఉత్తర భారతంలోని దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయునాణ్యతా సూచీ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు భౌగోళిక పరిస్థితులు కొంతవరకు కారణమైనప్పటికీ చాలావరకు మానవ కారక చర్యలేనన్నది చేదునిజం. దీపావళి బాణాసంచా పేలుళ్లు, పంట వ్యర్థాలను భారీస్థాయిలో తగలబెడుతుండటంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయునాణ్యత సూచీలో 500 పాయింట్లు పైన నమోదైంది. ప్రమాణాలు 400 నుంచి 500 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు పరిగణిస్తారు. 500కు మించితే అత్యంత హానికరమైన పరిస్థితులు నెలకొన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొనడం గమనార్హం. వాయునాణ్యతా ప్రమాణాలు దిగజారిపోవడంతో సాధారణ జనజీవనానికి దిల్లీ పరిసర ప్రాంతాల్లో అంతరాయం కలుగుతోంది. ముఖాలకు ముసుగులు లేకుండా వీధుల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయంటే కాలుష్య తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ దుస్థితి ఒక్క దిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. గురుగ్రామ్‌, ఘాజియాబాద్‌, ఫరీదాబాద్‌, నోయిడా తదితర ప్రాంతాలకూ విస్తరించింది. విషవాయు ప్రభావాలకు లోనయ్యే రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ ఉన్నాయి. పరిస్థితులు ఇప్పుడు మరీ అధ్వానంగా తయారుకావడానికి వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్యమార్పులే కారణం. సహజసిద్ధమైన పొగమంచుకుతోడు వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాలను మండించడం ద్వారా వచ్చే ఉద్గారాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దిల్లీకి పొరుగునున్న పంజాబ్‌, హరియాణా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో పంట దిగుబడులు బాగా ఉంటాయి. పంట వ్యర్థాలను కాల్చేయడం కూడా గణనీయంగానే ఉంటుంది. సాధారణంగా టన్ను పంట వ్యర్థాలను మండిస్తే 60 కిలోల కార్బన్‌ మోనాక్సైడ్‌తో పాటు దాదాపు 14 వందల కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలోకి విడుదలవుతుంది. వీటితోపాటు మూడు కిలోల సూక్ష్మ ధూళికణాలు, బూడిద, సల్ఫర్‌ డయాక్సైడ్‌ గాలిలో కలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తగలబడుతున్న పంట వ్యర్థాల్లో సగానికిపైగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే కావడంతో దీని ప్రభావం సమీపంలోని దిల్లీ నగరంపై తీవ్రంగా పడుతుంది. మంచు కురిసే కాలం కావడంతో దీని ప్రభావం రెట్టింపవుతుంది.

క్షీణిస్తోన్న భూసారం

పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం ప్రబలడంతోపాటు భూసారం సైతం క్షీణిస్తోంది. పంటలకు, పంట దిగుబడులకు ప్రయోజనకారిగా ఉండే వేలాది సూక్ష్మజీవులు పంట వ్యర్థాలను మండించడంవల్ల అగ్నికి ఆహుతైపోతున్నాయి. నేల పొరల్లో తేమశాతం ఆవిరైపోయి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని నిషేధించాల్సిందిగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నాలుగేళ్ల క్రితమే ఆదేశించినప్పటికీ ఫలితం లేదు. ఆ దిశగా కార్యాచరణ కొరవడింది.

కాలుష్యంతో మరణాలు

పర్యావరణ విధ్వంసంతో ఎండలు తీవ్రమవుతాయి. తీవ్ర వాయుకాలుష్యం ప్రబలుతుంది. దేశవ్యాప్తంగా వాయుకాలుష్యంతో చోటుచేసుకుంటున్న మరణాల్లో 23 శాతం పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సంభవిస్తున్న ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం వల్లేనని భారత వైద్య పరిశోధన మండలి నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. వాయుకాలుష్యం, గాలి నాణ్యతల్లో క్షీణత కారణంగా దిల్లీ వంటి నగరాల్లో శ్వాసకోశ సంబంధిత, గుండె సమస్యలు పెరుగుతాయని ‘ఎయిమ్స్‌’ హెచ్చరించడం గమనార్హం.

ప్రమాద ఘంటికలు

  • గాలి న్యాణతపరంగా 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగున ఉంది.
  • దేశంలోని మూడోవంతు నగరాలు, పట్టణాలు ‘గ్యాస్‌ ఛాంబర్లు’గా మారాయి.
  • చైనాలో పదేళ్లుగా వాయు కాలుష్య మరణాలు తగ్గుముఖం పడుతుండగా భారత్‌లో పెరుగుతున్నాయి.
  • దేశ జనాభాలో దాదాపు 85 శాతం ప్రజల ఆయుఃప్రమాణం ఏడేళ్లు తగ్గడానికి వాయు కాలుష్యం కారణమవుతోందని చికాగో విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది.
  • వరంగల్‌, కర్నూలు నగరాల్లో గాలిలో సీసం, ఆర్సెనిక్‌, నికెల్‌ శాతాలు నానాటికీ పెరుగుతున్నాయి.

దిద్దుబాటు చర్యలు అవసరం

పంట వ్యర్థాలను మండించడానికి బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలి. పంట వ్యర్థాలను వంటచెరకుగా వినియోగించడం, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ, విద్యుదుత్పాదనకు ఇంధన వనరుగా మలచుకోవడం ద్వారా వ్యర్థాల దహనాన్ని అదుపు చేయవచ్చు. వాయుకాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా తృణధాన్యాలు పండించేలా రైతాంగాన్ని తగిన ప్రోత్సహించాలి. దిల్లీ వంటి మహానగరాల్లో వాహనాలు వెదజల్లుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి సరి-బేసి సంఖ్యల వాహనాల రాకపోకల కన్నా మెరుగైన ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించి, ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయాలి. విచక్షణా రహితంగా కాలుష్య కారకాలను వెదజల్లుతున్న పారిశ్రామికవాడల పట్ల కఠినంగా వ్యవహరించడం అవసరం. పౌరసమాజంలో పర్యావరణ స్పృహను పెంపొందించాలి. ఆస్ట్రేలియా, బార్బడోస్‌, కెనడా వంటి దేశాలు గాలి నాణ్యతలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. వాయునాణ్యతలో మెరుగ్గా వ్యవహరిస్తున్న ప్రపంచదేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఆ దిశగా కార్యాచరణకు ఉపక్రమించడం పాలకుల తక్షణ కర్తవ్యం!

ABOUT THE AUTHOR

...view details