‘ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ ప్రత్యర్థి పక్షం పనికిమాలినదని రుజువు చెయ్యడానికే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో అవన్నీ సహజంగానే సఫలమవుతా’యని హెచ్‌ఎల్ మెంకెన్ అనే అమెరికన్ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్య అర్థవంతమే కాదు, అక్షర సత్యం కూడా! ఆయారామ్‌లకు అంబారీలు కట్టి గయారామ్‌లపై గుస్సాపడే నయా రాజకీయ దందా- ఫిరాయింపు నిషేధ చట్టానికి ఎలా చాపచుట్టేస్తోందో ఎక్కడికక్కడ కళ్లకు కడుతూనే ఉంది కదా! ‘దశాబ్దాలుగా నిబంధనలకు లోబడే రాజకీయ క్రీడ ఆడుతున్నాం... ప్రత్యర్థి పక్షాలు తొండాట ఆడుతుంటే మేమేం చెయ్యాలి?’ అని ఒకనాడు వాజ్‌పేయీ వాపోయారు. సమకాలీన పక్షాల్లో తనకుగల ‘విలక్షణత’ను వదిలేస్తే, కమలనాథులు సృష్టించగల రాజకీయ భూకంపాలకు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో రుజువులు పోగుపడ్డాయిప్పుడు. అందులో ‘సుప్రీం’ తీర్పుతో తాజాగా తెరిపినపడ్డ కర్ణాటకం లేవనెత్తుతున్న మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?
ప్రశ్నార్థకంగా ప్రజాస్వామ్య సూత్రాలు
‘రాజకీయ ఫిరాయింపుల జాడ్యం జాతికి తీవ్రాందోళనకర అంశం. దాన్ని మట్టుబెట్టకపోతే, అది దేశ ప్రజాస్వామ్య పునాదుల్నే కాదు, మౌలిక సూత్రాల్నీ దెబ్బతీస్తుంది’- అని 1985 నాటి ఫిరాయింపుల నిషేధ చట్టం మౌలిక లక్ష్య ప్రకటన ఎలుగెత్తి చాటుతోంది. ఇందిర హత్యానంతరం జరిగిన సార్వత్రికంలో స్వతంత్ర భారతావని చరిత్రలోనే అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టిన రాజీవ్ సర్కారు వండివార్చిన చట్టమది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో కొలువుతీరిన చట్టం పదిలంగా పరిఢవిల్లుతున్న దేశంలోనే- ఫిరాయింపుల సంస్కృతి దశదిశలా వ్యాపించింది. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నైతికతను పాలక ప్రతిపక్షాలు రెండూ నిష్ఠగా ఔదలదాల్చాలి. దానికి కట్టుబడటంలో- ఇండియాలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టే రాజకీయ వ్యవస్థ నైతికంగా భ్రష్టుపట్టిందన్న అభిప్రాయం జనమనంలో పాతుకుపోయింది’ అంటూ ‘సుప్రీం’ ధర్మాసనం రాసిన తీర్పు సమస్య మూలాల్ని సరిగ్గానే గుర్తించింది. ఎన్నికలంటే అధికారం కోసం ఆట, సర్కారు ఏర్పాటులో సంఖ్యాధిక్యం కోసం వేటగా దిగజారిపోయిన వాతావరణంలో- ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అవుతున్నాయి. జనహితం పట్టని ఈ తొండాట రాజకీయంలో తమ పంతమే నెగ్గాలంటూ కర్ణాటకలో పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కడంతో వెలువడిన తీర్పు- ఉభయ పక్షాలకూ సమ్మోద కారకమైంది! పదో షెడ్యూలులోని నిర్దిష్ట అంశాలను బలోపేతం చెయ్యడంపై పార్లమెంటు ఆలోచించాలన్న సుప్రీం సందేశం శాసనకర్తల చెవికెక్కకపోతే- ఫిరాయింపు నిషేధ చట్టం చిత్తు కాగితమంత విలువతో ఇకముందూ తేజరిల్లుతుంది!
తిలాపాపం తలా పిడికెడు