తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం వాటా పెంచితే.. రాష్ట్రాలు కోలుకునేదెలా! - eenadu eepaper

దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగమనం, నిరుద్యోగం, పారిశ్రామికోత్పత్తి పడకేయడం వంటి అంశాలు పెను ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. జీఎస్​టీ రాబడుల వృద్ధి 14 శాతం కంటే తక్కువ నమోదైతే కేంద్రం వాటికి నష్టపరిహారం చెల్లించాలని జీఎస్​టీ చట్టం స్పష్టం చేస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు చెల్లించాల్సిన మొత్తం రాష్ట్రాలకు అందాల్సి ఉంది. దీంతో అనేక రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మరోవైపు పన్నుల్లో కేంద్రం వాటా పెంచాలని ప్రభుత్వం కోరుతోంది.

పన్ను వసూళ్లు కేంద్రం-బాధ్యతలు మాత్రం రాష్ట్రాలదే!

By

Published : Nov 23, 2019, 11:29 AM IST

మాంద్యం తాలూకు నీలినీడలు దట్టంగా పరచుకొంటుండటంతో దేశవ్యాప్తంగా కుటుంబాలతోపాటు కేంద్ర రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లూ కిందుమీదులవుతున్నాయి. గిరాకీ మందగించి, పారిశ్రామికోత్పత్తి పడకేసి, ఉన్న ఉద్యోగాలు ఊడి, కుటుంబ ఆదాయాలు దిగజారి, వృద్ధిరేట్లు కుంగి, వసేప (జీఎస్‌టీ) వసూళ్లు నేలచూపులు చూస్తున్న వాతావరణం పెను ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది. ఆయా రాష్ట్రాలకు, అసెంబ్లీలు గల కేంద్రపాలిత ప్రాంతాలకు వసేప రాబడుల వృద్ధి 14శాతం కంటే తక్కువ నమోదైతే కచ్చితంగా వాటికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని జీఎస్‌టీ చట్టం స్పష్టీకరిస్తోంది. రెండు నెలలకోమారు కేంద్రం చేసే ఈ చెల్లింపులు జూన్‌-జులై మాసాలకు సంబంధించి రూ.28 వేల కోట్లు కాగా ఆ మొత్తం రాష్ట్రాలకు అందింది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు చెల్లించాల్సిన రూ.40 వేలకోట్లు అక్టోబరులోనే చేతికి అందాల్సిఉన్నా కేంద్రం విడుదల చెయ్యకపోవడంతో అనేక రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. కేరళ వంటి రాష్ట్రాలకు తాత్కాలిక రుణవసతిని వినియోగించుకొనే పరిమితీ దాటిపోవడంతో పాలన వ్యయానికి నిధులు ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియని దురవస్థ దాపురించింది. వసేప అమలులోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పశ్చిమ్‌ బంగ, దిల్లీ, రాజస్థాన్‌, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలు కేంద్రం నుంచి బకాయిల విడుదల కోసం ఏకగళం వినిపించి- జీఎస్‌టీ మండలి భేటీని డిమాండ్‌ చేస్తున్నాయి. మాంద్యంతోపాటు కార్పొరేట్‌ పన్నుల్లో కోతా నిధుల కటకట పెంచిందంటున్న రాష్ట్రాలు- ఈ తరహా వివాదాల పరిష్కారానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ గట్టిగా కోరుతున్నాయి. ఈ ఏడాది కేంద్రప్రభుత్వ స్థూల పన్ను రాబడుల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల దాకా తరుగుపడే ప్రమాదం ఉరుముతోంది. ఈ నెలాఖరుకు వెలువడే 15వ ఆర్థిక సంఘం నివేదిక తమ కష్టాలను గట్టెక్కించగలదని రాష్ట్రాలు ఆశిస్తున్నా, ఎన్‌కే సింగ్‌ సారథ్యంలోని సంఘం కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించే అవకాశం ఉందని వార్తాకథనాలు చాటుతున్నాయి. కరవులో అధికమాసం అంటే ఇదే! పన్నుల వాటాల్లో కేంద్రం ప్రతిపాదనలు రాష్ట్రాల్ని మరింత హతాశుల్ని చేసేవే!

కేంద్రం వాటా పెరగాలి

పద్నాలుగో ఆర్థిక సంఘం సూచించిన విధంగా విభాజ్య నిధుల్లో రాష్ట్రాలకు ఎకాయెకి 42శాతం వాటాకు అంగీకరించడం తమ చిత్తశుద్ధికి గీటురాయి అని లోగడ ఎన్‌డీఏ ప్రభుత్వం ఘనంగా చాటింది. 2017లో ఏర్పాటు చేసిన పదిహేనో ఆర్థిక సంఘం పరిశీలనాంశాల కూర్పు- రాష్ట్రాల వాటాను కుదించితీరాలన్న కేంద్ర సర్కారు పట్టుదలనే ప్రస్ఫుటీకరిస్తోంది. కేంద్రం విధులు, బాధ్యతలు గణనీయంగా పెరిగినందున ఇతోధిక నిధులు తనకు దఖలుపడేలా రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి తగ్గించాలని మోదీ ప్రభుత్వం కోరుతోంది. గత ఆర్థిక సంఘం ఇచ్చిన 42 శాతం వాటా కూడా రాష్ట్రాల్ని పెద్దగా ఉద్ధరించిందేమీ లేదన్న భాజపా పాలిత గుజరాత్‌- హళ్ళికి హళ్ళి సున్నకు సున్నగా కేంద్రం ప్రదర్శించిన చేతివాటాన్ని సోదాహరణగా లోగడే చాటిచెప్పింది. రక్షణ, జాతీయ భద్రత వంటివాటిపై కేంద్రం ఎంతగా వెచ్చించాల్సి వస్తున్నదో చూడాలంటూ ఆర్థిక సంఘం పరిశీలనాంశాల్లో ప్రస్తావించిన కేంద్రం- తాజాగా తన అభిమతాన్ని స్పష్టీకరించింది. దేశభద్రత భారాన్ని కేంద్రం, రాష్ట్రాలూ భరించాలని రక్షణ మంత్రిత్వ శాఖ కోరుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ సురక్షానిధి ప్రతిపాదన వెలుగుచూసింది. కేంద్రం చెంత పోగుపడే నిధుల్లో ‘సురక్షా నిధి’ మొత్తాన్ని ముందే పక్కనపెట్టి, తక్కినదాన్నే రాష్ట్రాలకు విభాజ్య నిధిగా నిర్ధారించాలన్న దానిపై తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రజలపట్ల రాజ్యాంగ విధివిహిత బాధ్యతలు నిర్వర్తించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధుల సరఫరాకు, ఆర్థిక సంక్షుభిత వాతావరణంలో ఇలా గండికొట్టడం- ఒక్కముక్కలో చెప్పాలంటే, కరవులో అధిక మోసం!

దేశభద్రతకు రాష్ట్రాలు చేయుతనివ్వాలి!

‘రాష్ట్రాల పరిధిలోని ప్రజారోగ్యాన్ని జాతీయ ప్రాధాన్యంగా గుర్తించి కేంద్రం తోడ్పాటు అందిస్తున్నప్పుడు, దేశభద్రతకు రాష్ట్రాల చేయూతనందిస్తే ఏమవుతుంది?’ అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ గడుసుగా ప్రశ్నలు సంధిస్తున్నా- క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు. ఇండియా రాష్ట్రాల సమాహారమైనా శక్తిమంతమైన కేంద్రం సింహభాగం పన్నుల్ని వసూలు చేస్తుంటే, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యత అత్యధికం రాష్ట్రాల భుజస్కంధాలపైనే ఉంది. ఆర్థిక సమాఖ్య భావనను వాస్తవంలో తేజరిల్లజేయడానికీ అయిదేళ్లకోమారు ఆర్థిక సంఘాల ఏర్పాటు ద్వారా హేతుబద్ధమైన వనరుల పంపిణీని రాజ్యాంగం లక్షించింది. అయినా విభాజ్య నిధి పరిధికి ఆవల సెస్సులు, సర్‌ఛార్జీలతో భారీగా ఖజానా నింపుకొంటున్న కేంద్రం- కేంద్ర ప్రాయోజిత పథకాలకూ రాష్ట్రాల భాగస్వామ్యాన్ని అంటుకట్టి పెత్తనం చలాయించడం దశాబ్దాలుగా సాగుతోంది. మోదీ జమానాలో కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్య తగ్గినా, రాష్ట్రాల వాటా గణనీయంగా పెరగడం తెలిసిందే. ఆ మోత చేటుకు జతపడి నిధుల లభ్యతా కోసుకుపోతే రాష్ట్రాల పరిస్థితి అగమ్యగోచరమే! ఆర్థిక సంఘం సిఫార్సులు అమలయ్యే 2020-’25 మధ్యకాలంలో మొత్తం రాబడుల్ని కేంద్రం 175 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. మాంద్యం తీవ్రత ఎంతకాలం ఏ తీరుగా ఉంటుందో తెలియనందున టోకున రాష్ట్రాల్ని పస్తుపెట్టి కేంద్రానికి ‘శిస్తు’కట్టే ధోరణి దేశార్థిక స్వస్థతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ‘ప్రజాకర్షక’ పథకాల్ని నిర్వచించే అదనపు బాధ్యతనూ పదిహేనో ఆర్థిక సంఘంపై కేంద్రం మోపింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో తలమునకలవుతూ అభివృద్ధి పథకాల్ని ఎండగట్టి, తాయిలాల పంపకాల్లో తిలాపాపం తలా పిడికెడు చందంగా కేంద్రం రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి. ఆ ధోరణులకు కళ్లెమేసి హేతుబద్ధ వాటాలకు ఆర్థిక సంఘం సమకట్టినప్పుడే రాష్ట్రాలు తెరిపినపడేది!

ABOUT THE AUTHOR

...view details