తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరంతర అభ్యాసమే నిజమైన ఆలంబన - ఈనాడు

ప్రపంచం ఇప్పటివరకు మూడు పారిశ్రామిక విప్లవాలను చూసింది. ఇప్పుడు నడుస్తోన్న నాలుగో పారిశ్రామిక విప్లవం ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులను ప్రేరేపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో 26 లక్షల రోబోలు పనిచేస్తున్నాయి. అమెరికాలో 45శాతం ఉద్యోగాలు ఆటోమేషన్ బారిన పడనున్నాయి. నెలల వ్యవధిలో నూతన సాంకేతికతలు పుట్టుకొస్తున్న తరుణంలో మన విద్యా విధానంలో మార్పు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిరంతర అభ్యాసమే నిజమైన ఆలంబన

By

Published : Nov 20, 2019, 7:50 AM IST

జేమ్స్‌ వాట్స్‌ 1780లో ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచం మూడు పారిశ్రామిక విప్లవాలను చూసింది. నాలుగోది ఇప్పుడు నడుస్తోంది. ఈ సరికొత్త విప్లవం ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులను ప్రేరేపిస్తోంది. నవ సాంకేతికతలు మన జీవితాలను, వృత్తివ్యాపారాలను సమూలంగా మార్చేస్తున్నాయి. మనుషులను సాటి మనుషులతోనే కాకుండా యంత్రాలతోనూ అనుసంధానిస్తున్నాయి. నేడు ప్రపంచమంతటా పరిశ్రమల్లో 26 లక్షల రోబోలు పనిచేస్తున్నాయంటే నాలుగో పారిశ్రామిక విప్లవం తీసుకొస్తున్న స్వయంచాలిత ఉత్పత్తి స్వరూపస్వభావాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కృత్రిమ మేధ, బిగ్‌ డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 3డీ ప్రింటింగ్‌, బ్లాక్‌చెయిన్‌, మొబైల్‌ సాంకేతికతలు, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నవ్య సాంకేతికతలు ప్రపంచ గతిని మార్చేస్తున్నాయి. బ్యాంకులు తమ ఖాతాదారుల రుణయోగ్యతను అంచనా వేయడానికి ఇప్పటికే కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. రుణ మంజూరుకు అధికారుల బదులు బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ను ఉపయోగిస్తున్నాయి. కంపెనీల్లో మానవ న్యాయవాదుల స్థానంలో రోబో వకీళ్లు రంగప్రవేశం చేశాయి. ఉద్యోగుల జీతభత్యాల పట్టిక తయారీ, సంస్థ ఖాతాల నిర్వహణ స్వయంచలితమయ్యాయి. ఆటోమేషన్‌ (స్వయంచాలనం) వల్ల కంపెనీలకు ఉత్పాదకత, సామర్థ్యం, లాభదాయకత ఇనుమడిస్తాయి. నాలుగో పారిశ్రామిక విప్లవం వల్ల ముఖ్యంగా కృత్రిమ మేధ కారణంగా 2030నాటికి ప్రపంచ జీడీపీ అదనంగా 14 శాతం మేర పెరుగుతుందని, ఈ మొత్తం 15.7 లక్షల కోట్ల డాలర్లకు సమానమని ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అంచనా వేసింది.

ఆటోమేషన్​తో కొత్త ఉద్యోగాలు

అమెరికాలో 45 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్‌ బారిన పడనున్నాయి. భారత్‌ వంటి దేశాల్లో కార్మికుల వేతనాలు ఇప్పటికీ తక్కువగా ఉండటం, పుష్కలంగా పనివారు అందుబాటులో ఉండటం... వంటి కారణాల వల్ల ఆటోమేషన్‌ కొంత నెమ్మదిగా సాగవచ్చు. మొత్తంమీద 2030కల్లా ప్రపంచ కార్మిక శక్తిలో 15 శాతం లేదా 40 కోట్లమంది ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోతారని మెకిన్సే గ్లోబల్‌ లెక్కగట్టింది. ఆటోమేషన్‌ పాత ఉద్యోగాలకు మంగళం పాడినా కొత్త ఉద్యోగాలకు తావిస్తుంది. ఆ సరికొత్త ఉద్యోగాలు ఎలా ఉంటాయో ప్రస్తుతానికి ఎవరి ఊహకూ అందడం లేదు. 2030నాటికి ఇప్పుడు లేని ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇప్పుడున్న కార్మికుల్లో 8 నుంచి 9 శాతం ఆ ఉద్యోగాల్లో కుదురుకుంటారని భావిస్తున్నారు. మున్ముందు అధునాతన సాంకేతికత వల్ల శాశ్వత ఉద్యోగాల స్థానంలో పరిమిత కాల ఉద్యోగాలు, ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలు వస్తాయి. స్వయంఉపాధి అవకాశాలు వృద్ధిచెందుతాయి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కిరాణా సరకులను ఇంటికి తెచ్చి ఇచ్చేవారు, మోటారు వాహనాల చోదకులు, అకౌంటు పుస్తకాలు రాసేవారికి గిరాకీ అధికమవుతుంది. ఒక దేశంలోని ప్రాజెక్టుపై వేర్వేరు దేశాల్లోని పరిమితకాల నిపుణులు కలిసి పనిచేసే రోజులు వచ్చేస్తున్నాయి. దానాదీనా సంఘటిత, అసంఘటిత రంగాలమధ్య భేదం చెరిగిపోనుంది. ఈ ఏడాది ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం మొత్తం అంతర్జాతీయ కార్మిక బలగం 350 కోట్లు. ప్రస్తుతం వారిలో ఫ్రీలాన్స్‌ పనిచేస్తున్నవారు మూడు శాతం. రానురానూ సృజనాత్మకత, నవీకరణ, జట్టుగా పనిచేసే విధానాలకు ప్రాముఖ్యం పెరిగి తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు రోబోల పరమవుతాయి. మేధా పాటవం (ఐక్యూ)తోపాటు భావోద్వేగ ప్రజ్ఞ (ఈక్యూ) ఉంటేనే వృత్తిఉద్యోగాల్లో, సామాజిక జీవితంలో రాణించగలుగుతాం. బట్టీ చదువుల బదులు విశ్లేషణాశక్తి, విమర్శనాత్మక ఆలోచన, తర్కం, సమస్యాపరిష్కారం, సకాలంలో సరైన నిర్ణయం చేసుకోగల సత్తా ఉన్నవారే రాబోయే రోజుల్లో విజయులవుతారు. సృజనాత్మక, సాంకేతిక, వ్యవస్థాపక నైపుణ్యాలు గలవారు రేపటి వృత్తివ్యాపారాల్లో నెగ్గుకురాగలుగుతారని 2030 సంవత్సరంలో విద్య, నైపుణ్యాలనే శీర్షికతో ‘ఓఈసీడీ’ వెలువరించిన నివేదిక స్పష్టీకరించింది.

నెలల వ్యవధిలో నూతన సాంకేతికతలు

ఒకప్పుడు సాంకేతిక మార్పులు రావడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడితే ఇప్పుడు సంవత్సరాలు, నెలల్లోనే వచ్చేస్తున్నాయి. ఈ మార్పులకు ప్రభావితమవుతున్న ఉద్యోగాల్లో రాణించాలంటే నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకొంటూ ఉండకతప్పదు. విద్యార్థి ఒక ఇంజినీరింగ్‌ కోర్సులో చేరేటప్పడు ఉన్న ఉద్యోగం అతడు పట్టాపుచ్చుకొనే సమయానికి అదృశ్యమై, సరికొత్త ఉద్యోగం పుట్టుకురావచ్చు. దాంతో కళాశాలలో నేర్చిన నైపుణ్యాలను మరింత పైఅంచెకు తీసుకువెళ్లక తప్పదు. యువతరం జీవితాంతం ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అలవరచుకోవలసిందే. కానీ, మన విద్యావిధానం కాలానికి తగినట్లు మారకుండా ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది.

బట్టీ సత్తాకే ఎక్కువ మార్కులు

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం ఫక్కీలో మన విద్యాబోధన సాగుతోంది. పాఠాలు చెప్పడం అధ్యాపకుల వంతు, వినడం విద్యార్థుల వంతు. ఒక తరగతిలోని విద్యార్థుల్లో ఎక్కువ ప్రజ్ఞాపాటవాలు కలిగినవారు ఉంటారు. తక్కువ తెలివితేటలు కలిగినవారూ ఉంటారు. వేగంగా నేర్చుకునేవారు ఉంటారు, నెమ్మదిగా నేర్చుకునేవారూ ఉంటారు. విద్యార్థుల స్థాయీభేదాలకు తగినట్లు బోధన, అభ్యాసాలు జరగడం లేదు. అయినాసరే అందరూ ఒకే తరగతిలో కూర్చుని ఒకేసారి పరీక్షలు రాస్తారు. వారి ప్రజ్ఞకన్నా బట్టీ సత్తాకే ఎక్కువ మార్కులు పడతాయి. మొదటి పారిశ్రామిక విప్లవ కాలంలో ఫ్యాక్టరీ కార్మికులు, ఆఫీసు గుమాస్తాలను తయారుచేయడానికి ఉపకరించిన ఈ పద్ధతి నాలుగో పారిశ్రామిక విప్లవంలో పనిచేయదు. వేగంగా మారిపోయే సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి గురువులు, విద్యార్థులు పరుగుతీయక తప్పదు. కళాశాల ప్రాంగణంలోని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేసే పద్ధతి క్రమేణా కనుమరుగవుతుంది. తరగతిలోకి వెళ్లేముందే అధ్యయనాంశాలను ఆకళింపు చేసుకుని, తరగతిలోకి వెళ్లిన తరవాత సాటి విద్యార్థులతో బృంద చర్చలు జరపడం, సమస్యాపరిష్కారానికి జట్టుగా కలసి ప్రయత్నించడం, అంతర్జాలంలో కోర్సులు నేర్చుకోవడం, వివిధ పద్ధతులు మేళవించిన బోధనాభ్యాసాలను అనుసరించడం రివాజు కానున్నాయి. వివిధ వేదికల నుంచి నైపుణ్యాలను నేర్చుకొంటూ విద్యార్థి తనకుతానే గురువుగా, శిష్యుడిగా ముందుకుసాగుతాడు. అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా పనిచేస్తారు.

నాలుగో పారిశ్రామిక విప్లవంలో విద్య

కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీలు విద్యా బోధనాభ్యాసాలను మార్చేస్తాయి. విద్యార్థుల ఆసక్తి, విజ్ఞాన స్థాయికి తగినట్లు బోధనాభ్యాసాలను అందించే మెక్‌ గ్రా హిల్‌ స్మార్ట్‌ బుక్‌ వంటి వైయక్తిక అభ్యసన పద్దతులు నేడు అందుబాటులోకి వచ్చాయి. నాలుగో పారిశ్రామిక విప్లవకాల విద్య కేవలం ఉద్యోగాలు సంపాదించడానికి తోడ్పడటంకన్నా విద్యార్థులను లోతుగా ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుగొనగలవారిగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తుంది. ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులకు దీటుగా నింపాదిగా స్పందించగల నాయకులుగా తయారుచేస్తుంది. విద్యార్థుల స్థాయీభేదాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి తగ్గ బోధనాంశాలను వారికి నేర్పే సాంకేతికతలను ఉన్నత విద్యాసంస్థలు పుణికిపుచ్చుకొంటాయి. విద్యా సంస్థలు పరిశ్రమలతో, చుట్టూ ఉన్న సమాజంతో సమన్వయం నెరపుతూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందించాలి. ప్రాజెక్టులు చేయించాలి. అవసరమైనప్పుడల్లా సలహా సంప్రతింపులు, మార్గదర్శకత్వం అందించాలి. పనిచేస్తూ నేర్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వాలి. విద్యాభ్యాసం ముగించుకుని ఉద్యోగాల్లో వెళ్లిపోయిన విద్యార్థులు కొత్త అంశాలను నేర్చుకోవడానికి మళ్ళీ కళాశాలకు వచ్చే వెసులుబాటు ఉండాలి. కావలసిన కోర్సులు నేర్చుకుని తిరిగి ఉద్యోగంలోకి వెళ్లిపోవడం, మళ్ళీ అవసరమైతే విద్యా సంస్థకు తిరిగిరావడం రివాజు కావాలి. నాలుగో పారిశ్రామిక విప్లవ సారమిదే!

-డాక్టర్ టి.సిద్ధయ్య(రచయిత-మాజీ రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం)

ABOUT THE AUTHOR

...view details