ఇది విన్నావా అన్నా! చాలా సర్కారీ బడుల్లో పిల్లలు 'ఒకటికి' బయటికే వెళ్లాల్సి వస్తోందిట. శౌచాలయాలు కట్టిద్దామంటే బడ్జెట్లో విద్యాశాఖకు నిధులు విదల్చలేదట ప్రభుత్వం. హవ్వ... ఎంత సిగ్గు చేటు? వాటిని కట్టించడానికి సీఎస్సార్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత - కా.సా.బా.) నిధులను సమీకరిస్తారట అధికారులు'
'అవున్రా... తప్పేముంది అందులో? ప్రతి పనికీ బడ్జెట్లో నిధుల్ని కేటాయించలేరు కదా! అందుకే సీఎస్సార్ నిధుల్ని సమీకరిస్తామని అధికారులు అన్నారేమో! పాపమని పచ్చిపులుసు పోస్తే, నేతిబొట్టు లేదని లేసి లేసి ఉరికిండట నీలాంటివాడు. అలాగుంది నీ వాటం'
'అదేంటన్నా అలాగంటావ్! ప్రభుత్వానికి బాధ్యత ఉండదా?'
'ఎందుకుండదూ? ఉండబట్టే కదా ఇన్నేసి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సంక్షేమ పథకాలు వగైరాలు సమకూరుతున్నాయి. వీటికే నిధులు సరిపోవడంలేదు. అంచేత విద్య, వైద్యం, శౌచం వగైరాలన్నింటికీ సీఎస్సార్ కింద నిధులు వసూలు చేయాల్సిందే! అదేదో సినిమాలో చెప్పినట్లు, సంపాదనలో ఎంతోకొంత తిరిగిచ్చేయాలి... లేకపోతే లావెక్కిపోతారు. ఇదేమరి సీఎస్సార్ అంటే!'
ఎన్ని స్కీములుంటే అన్ని స్కాములు
'అంతేలే అన్నా, బడ్జెట్లో ఎన్ని స్కీములుంటే అన్ని స్కాములకు అవకాశం. ఉత్తరోత్తరా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరికీ అనుమానం రాకుండా, కేసులు మన మెడకు చుట్టుకోకుండా, ఇంజినీరింగ్ శాఖలో మాదిరిగా అధీకృత ఖర్చుల విలువలోనే ఆమ్యామ్యానూ జోడిస్తే- ఇక తిరుగుండదు'
పౌరులకు సామాజిక బాధ్యత ఉండదా?
'హ్హ...హ్హ... నీక్కూడా విషయం బాగానే వివరమైంది. నీకు చెప్పడం బహు తేలిక. అయినా, నాకు తెలీక అడుగుతా... పౌరులకు సీఎస్సార్... అదే, పౌరుల సామాజిక బాధ్యత పౌ.సా.భా. ఉండదా? మీ పిల్లలు చదువుకునే పాఠశాలల్లో శౌచాలయాలు లేకపోతే మీరందరూ ఏం చేస్తున్నట్టు? చందాలు వసూలు చేసో, శ్రమదానానికి దిగో కట్టించుకోలేరా? ఆ మాత్రం పౌ.సా.బా. మీకు లేదా అని క్రొశ్నిస్తున్నాను'
'అంతేలే అన్నా... కరెక్టుగా చెప్పావు. వాటిని ప్రభుత్వమే ఊరూరా ఏర్పాటు చేయడానికి అవేమైనా నిత్యకల్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయే బెల్టు షాపులా ఏంటి?'
'అదేరా నేననేది కూడా. అటువంటి పౌ.సా.బా. జనానికి లేకపోబట్టే మహారాష్ట్రలో ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా బాధ్యతే ఉంటే, అంతటి గ్రహింపే ఉంటే, ఇలా 'కిచిడీ'లా ఎందుకవుతుందీ?
మరి రాజకీయ నాయకులకు?
'అదేంటన్నా, అంతమాటనేశావ్? పౌరులకు, సంస్థలకేనా సీఎస్సార్? రాజకీయ పార్టీలకు, నాయకులకు ఉండదా?'
'ఓహ్... లేకేం భేషుగ్గా ఉంది. కామన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఉమ్మడి సామాజిక బాధ్యత అని అంటారు వాళ్ళ సీఎస్సార్‌ని. హరియాణాలో చూడు- వాటికున్న ఉ.సా.భా.ను గుర్తుచేసుకుని, జేజేపీ, బీజేపీ కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఏదో ఒకరకంగా ప్రభుత్వాల్ని ఏర్పాటుచేసి అధికారాల్ని అందుకోవడం, పంచుకోవడం, పెంచుకోవడమే పార్టీలకు, నాయకులకు ఉండే సీఎస్సార్ అంటే'