తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమాఖ్య గళం బలపడాల్సిన సమయం - రాజ్యసభ సమావేశం

ప్రపంచ జనాభాలో ఏడోవంతు ప్రజల భవిష్యత్​ నిర్ణాణానికి వేదికైన భారత పార్లమెంట్​లో పెద్దల సభ పాత్ర ప్రాముఖ్యమైనది. సమాఖ్యా స్ఫూర్తి పరిఢవిల్లేలా రాష్ట్రాలకు ప్రాతినిథ్యం దక్కాలని రాజ్యాంగ రూపకర్తలకు ఉన్న దూరదృష్టికి రాజ్యసభ ప్రతిరూపం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో తనదైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న రాజ్యసభ నేడు 250వ సమావేశానికి సమాయత్తమవుతోంది.

సమాఖ్య గళం బలపడాల్సిన సమయం

By

Published : Nov 18, 2019, 7:27 AM IST

ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో ఎగువ సభ 250వ భేటీ మైలురాయిని చేరిన ఘనతర సందర్భమిది. ప్రపంచ జనావళిలో ఏడోవంతు ప్రజల భవిష్యత్‌ నిర్మాణ వేదికైన భారత పార్లమెంటులో కీలక భాగస్వామిగా పెద్దల సభ పోషిస్తున్న పాత్ర నిరుపమానమైనది. దేశ ప్రగతికి కరదీపిక అనదగ్గ కేంద్రస్థాయి శాసన నిర్మాణ మహా క్రతువులోనూ సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కాలన్న రాజ్యాంగ రూపశిల్పుల దూరదృష్టి సద్వివేచనలకు నిదర్శనగా రాజ్యసభ ఆవిర్భవించింది. ఎగువ సభను డాక్టర్‌ అంబేడ్కర్‌ రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా పేర్కొన్నారంటే కారణం అదే. నేరుగా ప్రజలచేత ఎన్నికై అయిదేళ్లకోమారు కాలంచెల్లే లోక్‌సభకు పూర్తి భిన్నంగా నిరంతరాయంగా కొనసాగే రాజ్యసభకు దఖలుపడ్డ రాజ్యాంగబద్ధ విధులు జనస్వామ్య చేతనకు గొడుగు పట్టేవే! ‘పార్లమెంటు అంటే శాసన నిర్మాణానికే కాదు, అది చర్చలకూ వేదిక. ఆ విషయంలో మనమంతా విలువైన సేవలందించాల్సి ఉంది’ అని 1952 మే నెలలో సర్వేపల్లివారు ఉద్బోధించారు. కీలక శాసనాల నిర్మాణంలో తొందరపాటును నివారించడానికి ఎగువ సభ ఎంత అవసరమో చేతల ద్వారా నిరూపించుకోవాల్సి ఉందనీ ఉపదేశించారు. ఎగువ సభకు రాజ్యసభగా నామకరణం జరిగిన 1954లోనే దాన్ని రద్దు చెయ్యాలంటూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ తోసిపుచ్చింది. అటువంటి విఫలయత్నమే 1973లోనూ జరిగింది. రాజ్యసభకు చెల్లుకొట్టాల్సిందేనంటూ 1971, 72, 1975, 81 సంవత్సరాల్లో కొందరు సభ్యులు ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లులకూ అదే గతి పట్టింది. అడపాదడపా లోక్‌సభ రాజ్యసభల మధ్య చిటపటలు రాజుకొన్నా అవి కట్టుతప్పకుండా కాచుకోవడంలో పరస్పర సమన్వయం- జనస్వామ్య జోడెద్దులుగా వాటిని నిలబెట్టింది. దిగువ సభకు ఎన్నికైన మెజారిటీ పక్ష నిర్ణయాలకు, ఎగువ సభలో దామాషా ప్రాతినిధ్యం ద్వారా కొలువైన సమాఖ్య ప్రయోజనాలకు మధ్య మేలిమి సమతూకాన్ని రాజ్యాంగ నిర్మాతలు లక్షించారు. వారి ఆశయాలు సాకారమయ్యేలా, పరిణత చర్చలకు పాదుచేసేలా ఎగువ సభ స్వయం సంస్కరణలకు సంసిద్ధం కావాల్సిన సమయమిది!

ప్రతిష్ఠకు నాలుగో 'డి' తూట్లు

చట్టసభల ప్రతిష్ఠ ఒక్కసారి నేలమట్టమైతే ప్రజాస్వామ్యమే పెను సంక్షోభంలో పడుతుందని తొలి ప్రధాని నెహ్రూ విస్పష్టంగా హెచ్చరించారు. పోనుపోను మాన్య సభ్యుల ప్రవర్తన హుందాతనాన్ని సంతరించుకొంటుందన్న తొలితరం నేతల ఆకాంక్షలు వట్టిపోయాయనడానికి ఉభయ సభల భేటీలే గట్టి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయిప్పుడు! రాజ్యసభ అధ్యక్షుడిగా సభ్యుల వీరంగాన్ని కట్టడి చెయ్యలేక లోగడ శంకర్‌ దయాళ్‌శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. 1969లో పార్లమెంటులో తొలిసారి కాలిడిన తాను పీవీ విజ్ఞత నుంచి, అటల్‌జీ వాక్పటిమ నుంచి, మధులిమాయే, డాక్టర్‌ నాథ్‌పాయ్‌ల వ్యంగ్యోక్తుల నుంచి, పీలూమోదీ హాస్యం, ఇంద్రజిత్‌ గుప్తా గట్టి ప్రత్యుత్తరాల నుంచి ఎంతో నేర్చుకొన్నానని ప్రథమ పౌరుడిగా నిరుడు పదవీ విరమణ చేసిన ప్రణబ్‌ దా వెల్లడించారు. ఆ తరహా స్ఫూర్తిదాతలు అరుదైపోతున్న వాతావరణంలో చర్చలు రాజకీయ రచ్చలుగా దిగజారి వ్యవస్థ ప్రతిష్ఠను దిగలాగుతున్నాయి. చర్చ (డిబేట్‌), అసమ్మతి (డిసెంట్‌), నిర్ణయం (డెసిషన్‌)... ఇలా మూడు ‘డి’లతో నడవాల్సిన పార్లమెంటు ప్రతిష్ఠకు నాలుగో ‘డి’ (డిస్రప్షన్‌- అడ్డుకోవడం) కారణంగా తూట్లుపడుతున్నాయి. క్రితంసారి రాజ్యసభ 35 రోజులపాటు సమావేశమై 32 బిల్లులు ఆమోదించిందని, అది గత 17 ఏళ్లలోనే (అంటే 52 సమావేశాల్లో) అత్యుత్తమ పని తీరనీ రాజ్యసభాధ్యక్షుడిగా వెంకయ్య మొన్న ఆగస్టులో ప్రకటించారు. సహేతుక చర్చ, సంవాదాలు సాఫీగా సాగడం పరిణత ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. పెద్దల సభ ప్రతిష్ఠ మరింత ఇనుమడించాలంటే- పార్లమెంటు సర్వసత్తాక వ్యవస్థ అయినందువల్ల స్వయం నిర్దేశిత క్రమశిక్షణ, సంయమనాలతో తనకు తాను మార్గదర్శనం చేసుకొని, తప్పులు దిద్దుకొని, అవసరమైతే తనను తాను శిక్షించుకోవాలంటూ రాజ్యసభాధ్యక్షుడిగా కేఆర్‌ నారాయణన్‌ చేసిన సూచన శిరోధార్యం!

నలుగురు రాజ్యసభ ప్రధానులు

రాజ్యాంగంలోని 75(3) అధికరణ అనుసారం కేంద్రప్రభుత్వం లోక్‌సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. లోక్‌సభతోపాటు రాజ్యసభకూ ప్రభుత్వం సమానంగా జవాబుదారీ అయినా సర్కారీ అస్తిత్వాన్ని ఎగువ సభ ఏమాత్రం ప్రభావితం చెయ్యలేదని రాజ్యాంగం చెబుతోంది. అధికార పక్షానికి రాజ్యసభలో మెజారిటీ కొరవడితే రెండు సభల మధ్య నెలకొనే ప్రతిష్టంభన- కొన్ని సందర్భాల్లో వైమనస్యాలకు దారితీస్తోంది. ఆయా బిల్లుల్ని నిలువరించడమే ధ్యేయమన్నట్లుగా గజ్జెకట్టే వికృత రాజకీయ కళాకేళి చట్టసభల ప్రతిష్ఠనే ఖర్చురాసేయడం, ‘ఇలాగైతే అసలు పార్లమెంటు ఎందుకు’ అన్న నిర్వేదం సగటు పౌరుల్లో రగలడం ఇటీవలి ముచ్చటే. వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం నిలబడాలంటే- చట్టసభల్లోనూ, బయటా తమ సభ్యుల నడతను నిర్దేశించే ప్రవర్తన నియమావళికి పార్టీల కట్టుబాటు అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించడం సముచితమైనదే! మాన్య సభ్యులకు ప్రవర్తన నియమావళిని కూర్చడంలో పెద్దల సభే ముందుంది. ప్రభుత్వ మనుగడకు లోక్‌సభ విశ్వాసమే ప్రాతిపదిక అయినా- ఇందిర, దేవెగౌడ, గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌ వంటి ప్రధానుల్ని రాజ్యసభే అందించి విలక్షణత చాటుకొంది. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి లంచాలు మేసిన ప్రబుద్ధుల్ని 2005లో నిష్కర్షగా సాగనంపి ఉభయ సభలూ సమున్నతాదర్శానికి పట్టంగట్టినా, అవినీతి చెదను పూర్తిగా నిర్మూలించాలంటే బ్రిటన్‌లో మాదిరిగా వ్యవస్థను పటిష్ఠీకరించే చొరవ కనబరచాలి. పెద్దల సభ ఔన్నత్యాన్ని నిలబెట్టే నిష్ణాతుల్ని పార్టీలు ఎంపిక చెయ్యడం ఎంత ముఖ్యమో, స్వీయ పనిపోకడల మెరుగుదలతో సమాఖ్యస్ఫూర్తిని ప్రతిధ్వనించే రాజ్యాంగ గళంగా రాజ్యసభ రాణించడం మరింత అవసరం!

ABOUT THE AUTHOR

...view details