దేశ జనాభాలో 54 శాతానికిపైగా పాతికేళ్ల యువతతో వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు పరవళ్లెత్తనున్న భారతావని, ఎంతమాత్రం వినదలచుకోని మాట- నిరుద్యోగిత. చదువుకు బతుకుతెరువుకు ఏనాడో లంకె తెగిపోయిన గడ్డమీద, సరైన ఉపాధికి నోచనివారి నిష్పత్తి నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతోందన్నది అధికారిక అంచనా. దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువజనుల్లో 90శాతం మేర ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ మెలకువలు కొరవడ్డాయని నిపుణులు మొత్తుకుంటున్నారు. ఏటా పది లక్షలమంది వరకు ఇంజినీరింగ్ పట్టాలు పొంది ఉపాధి వేటలో అడుగిడుతున్నా, వారిలో అరవైశాతం దాకా తగిన ఉద్యోగాలు దక్కక నిరాశా నిస్పృహల్లో కమిలిపోతున్నట్లు అధ్యయనాలు, గణాంకాలు చాటుతున్నాయి.
ఇంటర్న్‌షిప్‌ల ప్రతిపాదన
ఈ దుస్థితిని చెదరగొట్టేందుకంటూ, ఇంజినీరింగ్ పట్టభద్రుల ఉద్యోగార్హతల్ని పెంపొందించే నిమిత్తం- పట్టణ స్థానిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్స్‌ను ఇటీవలి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. వాస్తవానికి కిలా (కేరళ స్థానిక పాలన సంస్థ), సుచిత్వ మిషన్, క్లీన్ కేరళ సంస్థ తదితరాల్లో ఏడాదిపాటు ఇంజినీరింగ్ పట్టభద్రులు, సార్వత్రిక పట్టభద్రులు పనిచేసే ఉభయతారక విధాన ప్రతిపాదన గత డిసెంబరులోనే వెలుగుచూసింది. ఎంపికైనవారికి పదివేలనుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. రెండేళ్ల క్రితం అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సైతం ఈ తరహా ప్రతిపాదనలు వెలువరించింది. నాలుగేళ్ల ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేలోగా ఏదైనా సంబంధిత సంస్థలో 12-24 వారాలపాటు ప్రతి విద్యార్థీ విధిగా పనిచేయాలని 2017లో ఏఐసీటీఈ నిర్దేశించిన దరిమిలా కొంత పరివర్తన నమోదైనా- మౌలికాంశాలపై పట్టు సాధించడంలో అత్యధికులు వెనకబడే ఉంటున్నారు. బడ్జెట్లో వెలిబుచ్చిన సంకల్పాన్ని సాకారం చేసేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన కదలాల్సి ఉందిప్పుడు!
దిద్దుబాటు చర్యలేవి
దేశంలో వేలంవెర్రి చదువులకు మచ్చతునక- ఇంజినీరింగ్ విద్య. లక్షలమంది యంత్రవిద్యా పట్టభద్రుల్లో ఉద్యోగార్హత కలిగినవారు కేవలం నాలుగోవంతేనని ప్రఖ్యాత మెకిన్సే సంస్థల వంటివి కొన్నేళ్ల క్రితమే నిగ్గుతేల్చినా- సరైన దిద్దుబాటు చర్యలు పట్టాలకు ఎక్కనేలేదు. సీఎస్‌ఈ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్ వంటి విభాగాలతో పోలిస్తే మెకానికల్, ఎలెక్ట్రానిక్స్, సివిల్, ఎలెక్ట్రికల్ లాంటి సంప్రదాయ కోర్సుల్లో అధికంగా సీట్లు ఖాళీగా మిగిలిపోవడం చూస్తున్నాం. మంజూరైన సీట్లలో 30 శాతమైనా నిండని కళాశాలల్ని, కోర్సుల్ని చాపచుట్టేయాలన్న యోచనల నేపథ్యంలో- పనికొచ్చే సీట్లు పెంచాలన్న సూచనలు జోరెత్తుతున్నాయి. భవిష్యత్తులో విప్పారే అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకోగలిగేలా మేలిమి కోర్సుల ఎంపిక ఎంత కీలకమో, ఉద్యోగం వరించేలా నైపుణ్యాలు ఒంటపట్టించుకోవడం అంతే ముఖ్యం.
అరకొర యత్నాల ద్వారా అసాధ్యం