తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​​: ద్విముఖ పోరులో ఓటర్ల మొగ్గు ఎటువైపో? - దిల్లీమే సవాల్​: ఓటర్ల మోగ్గు ఎటుపైపు?

ఎన్నికల తేది సమీపిస్తోంది.. మరి ఈ సారి హస్తిన వాసులు ఎవరికి పట్టం కడతారు? దేశంలో అత్యధిక మెజారీటీ సాధించిన జాతీయ పార్టీకా లేక స్థానికంగా బలంగా ఉన్న సామాన్యుడి పార్టీకా? ఈ ద్విముఖ పోరులో హస్తం పార్టీ పరిస్థితి ఏమిటి? స్థానిక సమస్యలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయి?

eenadu editorial on delhi assembly election
దిల్లీమే సవాల్​: ఓటర్ల మోగ్గు ఎటుపైపు?

By

Published : Jan 28, 2020, 7:38 AM IST

Updated : Feb 28, 2020, 5:43 AM IST

మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని వాసులు దిల్లీ నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరగనున్న ఎన్నికల్లో... రెండోసారి కూడా గెలిచి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారం చేపడతామంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) నేతలు కొండంత విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఆప్‌తో హోరాహోరీ తలపడుతున్న భాజపా గట్టిపోటీ ఇస్తున్నా- ఇప్పటికే రేసులో కొంత వెనకపడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 1998-2013 మధ్య పదిహేనేళ్లపాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ- 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే- క్షేత్రస్థాయి నివేదికలు, ఇటీవల నిర్వహించిన కొన్ని ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారమైతే పరిస్థితులు ఆమ్‌ఆద్మీపార్టీకే అనుకూలంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన ఆప్‌ ప్రస్తుత ఎన్నికల నాటికి పుంజుకున్నట్లు చెబుతున్నారు.

దిల్లీమే సవాల్​: ఓటర్ల మోగ్గు ఎటుపైపు?

2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసిన భాజపా దిల్లీలో 57 శాతం ఓట్లతో మొత్తం ఏడు సీట్లనూ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి గట్టిపోటీ ఇస్తున్న ప్రత్యర్థి భాజపానే అయినా, ఇప్పటికీ పూర్తిస్థాయిలో దెబ్బతీసే పరిస్థితిని సాధించిందా అనేది సందేహమే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పెద్దయెత్తున భాజపాకు ఓటేసిన దిల్లీ నగర ఓటర్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపించడం లేదు.

పనులే ప్రచారాస్త్రాలు

ఎన్నికల రేసులో ప్రధానంగా రెండు అంశాలు ఆప్‌ను ఇతర పార్టీలకన్నా ముందు వరసలో నిలుపుతున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో చేపట్టిన పనులు ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుండటం ఒక కీలకాంశం కాగా, కేజ్రీవాల్‌కు ఉన్న విస్తృతమైన ప్రజాదరణ రెండోది. అంతేకాదు, భాజపాలోగానీ, కాంగ్రెస్‌లోగానీ... కేజ్రీవాల్‌ స్థాయిలో ప్రజాదరణ కలిగిన బలమైన నాయకులు లేకపోవడం కూడా ఆప్‌నకు కలిసొస్తోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ సరైన పనితీరును కనబరచలేదన్న సంగతి పక్కనపెడితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో మాత్రం దిల్లీ ఓటర్లు ముందునుంచీ ఆ పార్టీ వైపే చూస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆమ్‌ఆద్మీ తొలిసారిగా 2013లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడినప్పుడు అధికారాన్ని అధిరోహించేందుకు సరిపోయే ఆధిక్యం రాలేదు. 29.5 శాతం ఓట్లతో 28 సీట్లు మాత్రమే సాధించింది. ఆ తరవాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 54.3శాతం ఓట్లతో మొత్తం 70 సీట్లకుగాను 67 స్థానాలు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జాతీయ అంశాలైన... పౌరసత్వ సవరణ చట్టం, అధికరణ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ముమ్మారు తలాక్‌ వంటి విజయాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ తరహా అంశాల ఆధారంగా ఓటేశారనేది పరిశీలిస్తే, దిల్లీ ఓటర్లు ఎక్కువగా నగరంలోని స్థానిక అంశాలకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. గత అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన పనుల్ని బాగా ప్రచారంలోకి తెచ్చే వ్యూహంతో ఆప్‌ ఈసారి ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఝార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఓటర్లు జాతీయ అంశాలకన్నా స్థానిక సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దిల్లీ ఓటర్లు సైతం ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్థానిక అంశాల ప్రభావం

ఓటర్లు ఓటేసేటప్పుడు స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇస్తే... కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేపట్టిన పనులకు ప్రజల్లో భారీ స్థాయిలో ఆదరణ ఉన్నందున ప్రత్యర్థులపై ఆప్‌దే పైచేయిగా మారే అవకాశం కనిపిస్తోంది. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనాలు పొందిన ఓటర్లే నిర్ణయాత్మకంగా మారనున్నట్లు తాజా సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్న సంకేతాల్నిబట్టి ఓటర్లు జాతీయ అంశాలకన్నా రాష్ట్రస్థాయి సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్‌డీఎస్‌)’ చేపట్టిన అధ్యయనం ప్రకారం కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకన్నా, రాజధానిలో ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగానే ఓటు వేయాలని దిల్లీ ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఓటు వేసేటప్పుడు దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చేసిన పనులనే పరిగణనలోకి తీసుకుంటామని ప్రతి ఇద్దరిలో ఒకరికన్నా ఎక్కువ (55 శాతం) మంది ఈ సర్వేలో తమ అభిప్రాయం వెల్లడించారు. 15 శాతం మాత్రం కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగానే ఓటేస్తామన్నారు. దిల్లీ సర్కారు పాలనతీరుపై సీఎస్‌డీఎస్‌ చేపట్టిన సర్వేలో- ఆప్‌ ప్రభుత్వంపై అత్యధికులు సంతృప్తి కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపైనా సానుకూలత బాగానే ఉన్నప్పటికీ, హరియాణా, ఝార్ఖండ్‌ మాదిరిగానే, అది భాజపాకు అనుకూలమైన ఓట్ల రూపంలోకి మారే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసిన వారిలో సైతం- దిల్లీకి వచ్చేసరికి ఆప్‌వైపే మొగ్గు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

కనిపించని వ్యతిరేకత

ప్రత్యర్థులందరికన్నా ఆప్‌ను పైమెట్టులో ఉంచుతున్న ప్రధాన అంశం ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడమే. ఆప్‌ సర్కారుపై వ్యతిరేకతకు సంబంధించిన విస్పష్ట సంకేతాలు కనిపించడం లేదు. హరియాణా విషయానికొస్తే, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా భారీస్థాయిలో ఓట్లషేరు సాధించినా ఆ రాష్ట్ర సర్కారుపై వ్యతిరేకత కారణంగా కమలం పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కలేదు. అదేవిధంగా, ఝార్ఖండ్‌లో సైతం ఆదివాసీలు, తదితరుల్లో రఘువర్‌దాస్‌కు ఆదరణ తగ్గడం వల్లే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత కారణంగానే మోదీ కరిష్మాను సైతం కాదని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా ప్రభుత్వాలు ఓడిపోయాయి. అలాంటి ప్రభుత్వ వ్యతిరేకత పరిస్థితులు ఆప్‌ సర్కారుకు లేకపోవడం విశేషం. పార్టీకన్నా నేత ప్రజాదరణ అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే భాజపాకన్నా ఆప్‌దే పైచేయిగా మారుతోంది.

నిపుణుల అభిప్రాయం

దిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను ఢీకొట్టే నాయకులు రాష్ట్ర భాజపాలో కనిపించడం లేదు. దిల్లీ భాజపాలో పలువురు నేతలున్నా, కేజ్రీవాల్‌కున్న ప్రజాదరణకు సమీపంగా వచ్చేవారు ఒక్కరూ లేరని తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రతిష్ఠను ఊతంగా చేసుకొని భాజపా ఎన్నికల సమరాంగణంలో పోరాడుతోంది. దిల్లీ ఓటర్లలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ఇప్పటికీ మోదీకి స్థానమున్నా, దిల్లీ పాలన అంశాల ఆధారంగా కేజ్రీవాల్‌కు సైతం ప్రజాదరణ అధికంగానే ఉన్నట్లు సీఎస్‌డీఎస్‌ సర్వే చెబుతోంది. స్థానిక అంశాల ప్రభావాన్ని ఇదే స్థాయిలో పోలింగ్‌ వరకు కొనసాగేలా చేయగలిగితే, దిల్లీలో ఆప్‌ మరోసారి విజయం సాధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

-ప్రొఫెసర్ సంజయ్​కుమార్​
(రచయిత-దిల్లీలోని సీఎన్​డీఎస్​లో ఆచార్యులు)

ఇదీ చదవండి:అర కేజీ వెంట్రుకలను ఆరగించేసింది-ఎందుకో తెలుసా!

Last Updated : Feb 28, 2020, 5:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details