‘నా దేశం భగవద్గీత... నా దేశం అగ్నిపునీత సీత’ అంటూ జ్ఞానపీఠాధిపతి స్వర్గీయ సినారె కీర్తిగానం చేశారు. సహస్రాబ్దాల సంస్కృతీ విభవంతో నైతికత నాగరికతల కలబోతగా ఒకనాడు ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన దేశంపై పైశాచిక శక్తుల అసుర సంధ్య దట్టంగా ముసురేసిందిప్పుడు! ‘నా దేశంలో నాకెందుకు భద్రత లేదు?’ అంటూ బిహారుకు చెందిన యువతి పార్లమెంటు ఎదుట వేసిన ప్రశ్న- ఈ జాతి జనావళి గుండెఘోషకు ప్రతిధ్వని.
ఇంకెప్పుడు మార్పు?
2012 నాటి నిర్భయ దురాకృతం తరవాత యావద్దేశాన్నీ కంటతడి పెట్టించి, అసుర మూకల ఉసురు తీయాల్సిందేనంటూ చిన్నాపెద్దా ఊరూవాడా ఒక్క తీరుగా కదిలేలా హైదరాబాద్ దుర్మార్గం కదిలించింది. దేశవ్యాప్తంగా దశదిశలా ఆడపిల్లల మానప్రాణాల్ని కబళిస్తున్న కామాంధ నరవ్యాఘ్రాల దూకుడుకు పట్టపగ్గాల్లేకపోవడంపై పార్లమెంటులో ఉభయసభలూ స్పందించాయి.
చట్టాల సవరణకు సంసిద్ధమంటున్న మోదీ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలుపడేలా చూస్తామని ప్రకటించింది. ‘కావాల్సింది రాజకీయ సంకల్పమే తప్ప కొత్త బిల్లులు కాదు’ అని రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన పూర్తిగా అర్థవంతం. ‘లైంగిక దాడుల కేసుల్లో ఏం చేస్తున్నారు, నిర్భయ నిధి పరిస్థితేమిటి’ అంటూ జాతీయ మానవ హక్కుల సంఘం కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆరా తీయబోవడం- కంటితుడుపు వ్యవహారం! జాతిని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ ఉదంతం జరిగిన 2012లో దేశవ్యాప్తంగా నమోదైన అత్యాచార ఘాతుకాలు 24,923. పిమ్మట నిర్భయ చట్టం తెచ్చి, మహిళల భద్రతకు ఏటా వెయ్యి కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు పెట్టిన తరవాత అయిదేళ్లకు 2017లో 32,559 అత్యాచార కేసులు నమోదు కావడం- రాజ్యవ్యవస్థలోని డొల్లతనాన్నే ఎలుగెత్తి చాటుతోంది.
ఇండియాలో పర్యటించే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అమెరికా, బ్రిటన్లు చేస్తున్న హెచ్చరికలు- దేశ ప్రతిష్ఠకు ఏడు నిలువుల లోతు పాతరేస్తున్న వాస్తవం గ్రహించైనా ప్రభుత్వాలు తగురీతిన స్పందిస్తాయేమో చూడాలి!
గర్భం నుంచే..
‘జీవితాన్ని చక్కదిద్దుకొనే హక్కు మగవాళ్లకు ఎంత ఉందో ఆడవారికీ అంతే ఉంది’ అని ఏనాడో తీర్మానించారు మహాత్మాగాంధీ. భారత రాజ్యాంగ పీఠికా లింగసమానత్వ భావనకు పట్టం కట్టినా- సంబంధిత సూచీలో మొత్తం 129 దేశాల జాబితాలో ఇండియా 95వ స్థానంలో నిలవడం సిగ్గిలజేస్తోంది.
ఏడు పదుల గణతంత్ర భారతంలో ఎక్కడికక్కడ రాక్షసగణ తంత్రాలకు- గర్భస్థ శిశుదశ నుంచే ఆడతనం అమానుష దాడుల బారినపడటం నానాటికీ పెరిగిపోతున్నది. ‘మహిళలు, ఆడపిల్లలపై ఆటవిక హింసకు మూలకారణాలు శతాబ్దాలుగా సాగుతున్న పురుషాధిక్య భావ జాలంలో ఉన్నా’యని మొన్న నవంబరు 25న స్త్రీలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినం సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి చేసిన విశ్లేషణ సరైనదే.
ఎంత దౌర్భాగ్యం?