బోధన ఎంతో బాధ్యతతో కూడుకున్న ప్రక్రియ. జ్ఞానం, విలువలు, సంస్కృతి నేర్పించే పాఠశాల వాతావరణం అత్యుత్తమంగా, అహ్లాదభరితంగా ఉండాలన్న ఆలోచనతో సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్) తమ పరిధిలోని స్కూళ్లను గుణాత్మకంగా మార్చివేయాలని తీర్మానించింది. పాఠశాలలను ఆనందమయ అభ్యసన కేంద్రాలుగా, సమగ్ర ఆరోగ్య వికాస స్థలాలుగా, కోపానికి తావులేని ప్రశాంత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరిపూర్ణ విద్యాభ్యాసానికి విద్యార్థులు మానసికంగా సురక్షితంగా ఉండాలని; ముఖ్యంగా వారు ఇంటిపని (హోంవర్క్), గణితం, సామాన్యశాస్త్ర (సైన్స్) పఠనంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆనందమయమైన అభ్యసన వాతావరణం, సంతోషకరమైన తరగతి గది అద్భుతాలను సృష్టించగలవనడంలో అనుమానం లేదు. ఆ క్రమంలో సీబీఎస్‌ఈ చొరవ బహుధా శ్లాఘనీయం.
మార్గదర్శకాలివే...
కోప ఛాయలు లేని ప్రాంతాలుగా పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ కొన్ని మార్గదర్శకాలు చేసింది. విద్యార్థులతో సహజ మందహాస వదనంతో వ్యవహరించడం, వారితో హృదయ పూర్వకంగా సంభాషించడం, పిల్లలతో ప్రాణాయామం చేయించడం, చరవాణి వినియోగాన్ని పరిమితం చేయడం, ఏకాగ్రత కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు ప్రత్యేకించడం వంటివి చేయాలని సీబీఎస్‌ఈ తన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలలో మానసిక పూర్ణత్వం, చురుకుదనం అలవరుచుకున్న విద్యార్థులు ఇంటి వద్ద తమ ప్రవర్తనతో కుటుంబసభ్యుల ఆలోచనలో మార్పు తీసుకురాగలరు. వారిలో సంతోషం నింపి మరుసటిరోజు తిరిగి పాఠశాలకు ఆనందంగా వస్తారు. విద్యార్థులు మానసిక స్థిరత్వం కోల్పోయి, కోపతాపాలకు లోనవడానికి; ఇంట్లోనూ, బడిలోనూ సరైన అభ్యసన వాతావరణం లేకపోవడమే ముఖ్యమైన కారణం.
అందుకే 'పరీక్షా పే'
బోర్డు’ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి మోదీ దిల్లీలో ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమం నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన రెండు వేలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలో క్లిష్ట సమయాల్లో పరిణతితో ఎలా వ్యవహరించాలో ఆయన వివరించారు. చరవాణుల దుష్ఫలితాలను గుర్తించిన ప్రధాని సాంకేతికత మన గుప్పిట్లో ఉండాలి తప్ఫ.. దాని అదుపులోకి మనం వెళ్ళకూడదని చేసిన వ్యాఖ్యలు గుర్తుంచుకోదగినవి.
ఒత్తిడి.. ఒత్తిడి...
కౌమారదశలో విద్యార్థులకు తగిన నిద్ర ఉండటం లేదని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతూ- ఊబకాయం వంటి సమస్యల బారినపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యార్థుల శారీరక, మానసిక సమస్యల అధ్యయనానికి, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాలున్నాయి. మారుతున్న జీవన విధానం భారతీయ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తోంది. కల్తీ ఆహార పదార్థాల వినియోగం కారణంగా కౌమార ప్రాయంలోని పిల్లలు శారీరక, మానసిక సంతులనం కోల్పోతున్నారు. చిన్నచిన్న సంఘటనలకు పాఠశాల విద్యార్థులు అసహనానికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్నాయి.