తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70 ఏళ్ల గణతంత్ర భారతంలో ఆర్టికల్​ 356 అవసరమా? - latset news national

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా, రాజ్యాంగం గుర్తించిన 22 భాషలున్నా, అన్ని భాషల ప్రజల మధ్య సుహృద్భావం, ఐక్యతను సాధించగలిగాం. కానీ 356వ అధికరణను ప్రయోగించి రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను, చట్టసభలను రద్దుచేసే అధికారం కేంద్రానికి కట్టబెట్టడం- వలస పాలననాటి అవశేషం, సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం!. సమాఖ్య వ్యవస్థను మరింత బలపరచి, అధికారాన్ని వికేంద్రీకరించి, జవాబుదారీతనాన్ని, పాలన సామర్థ్యాన్ని పెంచడం- దేశ భవిష్యత్తుకు, ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకం!

editorial latest jaya prakash narayan
నిలవాలి గెలవాలి సమాఖ్య స్ఫూర్తి

By

Published : Jan 26, 2020, 7:11 AM IST

Updated : Feb 18, 2020, 10:47 AM IST

రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా ప్రకటించినా, ఇతర ఫెడరల్‌ దేశాల మాదిరిగా ఇది పూర్తిస్థాయి సమాఖ్య దేశం కాదు. నిజమైన సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల ఉనికి జాతీయస్థాయిలో ఉన్న ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు. రాష్ట్రాల సరిహద్దుల మార్పు లేదా విలీనం లేదా విభజన ఆ రాష్ట్ర సమ్మతి లేకుండా సమాఖ్య వ్యవస్థలో జరగదు. కానీ, మన రాజ్యాంగంలోని రెండు, మూడు అధికరణల ద్వారా పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, రాష్ట్రాల పేర్లను, సరిహద్దులను మార్చడానికి అధికారాలు సంక్రమించాయి. ఇటీవల ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల విభజన ఆ రాష్ట్రాల సమ్మతితో, దేశంలో ఏకాభిప్రాయంతోనే జరిగాయి. ఆ రీతిలోనే శాంతియుతంగా, ప్రజల ఆకాంక్షల మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందువల్లే ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా, రాజ్యాంగం గుర్తించిన 22 భాషలున్నా, అన్ని భాషల ప్రజల మధ్య సుహృద్భావం, ఐక్యతలను సాధించగలిగాం.

అఖిల భారత సర్వీసులు సమాఖ్య స్ఫూర్తికి విఘాతమైనా దేశ అవసరాల రీత్యా కొనసాగించాం. ప్రపంచంలో మరే ఫెడరల్‌ ప్రజాస్వామ్యంలో లేనిరీతిలో రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల్లో అమలయ్యే రాజకీయ నమూనాను, ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగంలోనే పొందుపరచారు. యూనియన్‌ ప్రభుత్వం రాష్ట్రాలకు రాజ్యాంగాధిపతులుగా ఎన్నికకాని గవర్నర్లను నియమించడమూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇక 356వ అధికరణను ప్రయోగించి రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను, చట్టసభలను రద్దుచేసే అధికారం కేంద్రానికి కట్టబెట్టడం- వలస పాలననాటి అవశేషం, సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం!

కేంద్రానికే ఎక్కువ అధికారాలు

ఏడో షెడ్యూలులోని అధికారాల విభజన ప్రకారం ఎక్కువ అధికారాలు కేంద్రానికే దఖలుపడ్డాయి. ఉమ్మడి జాబితా పేరిట రాష్ట్రాల్లో నిర్ణయాలు చేయాల్సిన అంశాలపైనా కేంద్రానికే పెత్తనం ఇచ్చారు. రాజ్యాంగంలో పేర్కొనని ఇతర అంశాలపైనా కేంద్రానిదే అధికారం. ఇవికాక రాష్ట్రాల జాబితాలోని అంశాలను కేంద్రానికి బదిలీ చేసే అధికారం రాజ్యసభకు ఉంది. అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే పార్లమెంటుకు అన్ని అంశాల మీద చట్టాలు చేసే అధికారం సంక్రమిస్తుంది. సమాఖ్య వ్యవస్థకు బదులు దేశమంతా యూనిటరీ వ్యవస్థగా మారిపోతుంది. రెండు, అంతకుమించి రాష్ట్రాలు కోరితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా పార్లమెంటు చట్టాలు చెయ్యవచ్చు. ఒకసారి అలాంటి చట్టం అమలుకు ఒక రాష్ట్రం అంగీకరిస్తే, ఇక ఆ అంశంపై ఆ రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ అధికారమూ ఉండదు. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా రాష్ట్రాల జాబితాలోని ఏ అంశం మీదైనా చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇలా వివిధ రూపాల్లో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి బదులు అపరిమితమైన కేంద్రీకరణకు రాజ్యాంగంలో ఏర్పాట్లు ఉన్నాయి.

భారత రిపబ్లిక్‌ ఏర్పడిన తరవాత రాష్ట్రాలకు చెందిన అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చి పార్లమెంటుకు, కేంద్రానికి తుది అధికారాలను కట్టబెట్టారు. దాంతో ఎన్నో రంగాల్లో స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా దేశమంతటికీ ఒకే మూసలో చట్టాలు చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి, విధానాల రూపకల్పనకు ఈ చట్టాలు ప్రతిబంధకమవుతున్నాయి. రాష్ట్రంలో న్యాయస్థానాల ఏర్పాటు, కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మార్పులను సైతం ఉమ్మడి జాబితాలో చేర్చడంతో సత్వర న్యాయం కోసం సంస్కరణలు చెయ్యాలన్నా కేంద్రం అనుమతి అవసరమవుతుంది. పాఠశాలవిద్యను ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు విద్యాప్రమాణాలు పెంచడానికి, వ్యవస్థను సంస్కరించడానికి వెసులుబాటు లేకుండా చేశారు. పార్లమెంటు విద్యాహక్కు చట్టం చేసింది. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా- దానిలోని లోపాలవల్ల తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భూమికి సంబంధించిన అన్ని అంశాలూ రాష్ట్రాల పరిధిలో ఉన్నా, భూ సేకరణను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో ప్రాజెక్టుల వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే వంకన పాడిపశువుల వాణిజ్యం మొత్తాన్నీ కఠినంగా నియంత్రిస్తూ, దాదాపు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు గ్రామీణ ఆర్థికవ్యవస్థను అల్లకల్లోలం చేశాయి.

చాలా అంశాల మీద కేంద్రానికి అధికారమున్నా, రోజువారీగా మౌలిక సదుపాయాలను ఏర్పరచడం, కనీస వసతులను కల్పించడం, విద్య, ఆరోగ్యాలను ప్రజలందరికి అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, సత్వర న్యాయాన్ని అందించడంవంటి కీలక బాధ్యతలన్నీ రాష్ట్రాలవే. అంటే కేంద్రానికి అధికారాలు ఎక్కువ, బాధ్యతలు తక్కువ. అయినా వనరుల్లో సింహభాగం కేంద్రానిదే! ఈ వనరుల సమస్యకుతోడు ఆర్థిక, సామాజిక ప్రణాళికలను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో చాలా అంశాల్లో నిర్ణయాధికారం కేంద్రీకృతమైంది. రాష్ట్రాల జాబితాలోని అంశాల మీద పథకాలు, ప్రాజెక్టులు కూడా కేంద్ర నిర్ణయం కోసం పడిగాపులు కాయడం, ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ అయింది. ప్రణాళిక సంఘం రద్దుతో పరిస్థితి కొంత మారినా, నిర్ణయాల్లో అధికార కేంద్రీకరణ కొనసాగుతోంది. అనేక కేంద్ర ప్రతిపాదిత పథకాలను రాష్ట్రాలపై రుద్దుతున్నారు. వాటిని కేంద్రం నిర్ణయించినట్లుగా అమలు చేస్తేనే రాష్ట్రాలకు నిధులు దక్కుతాయి. ఇలా రాజ్యాంగ నిర్మాణంలోని ఏర్పాట్లవల్ల, ఆ తరవాత రాష్ట్రాల అధికారాలను మరింత కుదిస్తూ చేపట్టిన సవరణలవల్ల, ఆర్థిక కేంద్రీకరణ వల్ల, కేంద్ర ప్రతిపాదిత పథకాలవల్ల కేంద్రీకరణ పెరిగి సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తి దెబ్బతింది.

ఆశలు కల్పిస్తున్న శుభసూచకాలు

సమాఖ్య వ్యవస్థ కొంతమేరకు బలపడి పరిణతి చెందిన మాట వాస్తవం. ప్రధానంగా రెండు కారణాలు అందుకు దోహదపడ్డాయి. మొదటిది, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు! రాష్ట్రాల సమ్మతితోనే విభజన ప్రక్రియ చేపట్టడమనే ఆరోగ్యకర సంప్రదాయం. రెండోది, తొలి నుంచి జాతీయస్థాయిలోని ప్రభుత్వాలు క్రమంతప్పకుండా కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలను పరిశీలించే ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసి, ఆ సంఘాల సిఫార్సులను తప్పకుండా అమలుచేయడం. ఈ కారణంగా సమాఖ్య వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పద్ధతి ప్రకారం, హేతుబద్ధంగా అమలవుతూ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేశాయి. 1991 నుంచి ఉత్పన్నమైన మరికొన్ని పరిణామాలు సమాఖ్య వ్యవస్థను కొంతమేర బలోపేతం చేశాయి. కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం అంతరించి, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడటంతో జాతీయస్థాయిలో ఉన్న ప్రభుత్వాలు విధిగా రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. బొమ్మై కేసులో 1994నాటి సుప్రీంకోర్టు తీర్పువల్ల రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేసి 356వ అధికరణను దుర్వినియోగం చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం చాలావరకు ఆగిపోయింది. 1991లో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో విధిగా ఆర్థిక సంస్కరణలను చేపట్టాల్సి వచ్చింది.

ఆ సంస్కరణల్లో భాగంగా ‘లైసెన్సు-పర్మిట్‌-కోటా’ రాజ్యం చాలామేరకు అంతమైంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు ప్రతి చిన్న నిర్ణయానికి దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి పడిగాపులు కాయడం తగ్గింది. రాష్ట్రాలు తమతమ పెట్టుబడులతో, విధానాలతో ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడులకు మార్గాలు ఏర్పరచుకోవడం సాధ్యమైంది. గతంతో పోలిస్తే ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థల పాత్ర తగ్గింది. మార్కెట్లో స్వేచ్ఛ, పోటీ పెరిగాయి. ఇటీవల ప్రణాళిక సంఘాన్ని రద్దుచేయడంతో కొంతమేరకు ఆర్థిక నిర్ణయాల్లో కేంద్రీకరణ తగ్గింది. ఇవన్నీ సమాఖ్య వ్యవస్థకు శుభసూచకాలు.

ఇక 356వ అధికరణ దుర్వినియోగం కాదని భావిస్తున్న సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఇటీవల మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో చేపట్టిన చర్యలు మరింత కేంద్రీకరణకు దారితీసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బకొడుతున్నాయి. రాష్ట్రాలను సంప్రతించకుండానే ఏకపక్షంగా, అసమగ్రంగా చేపట్టిన నోట్లరద్దు కార్యక్రమం- రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు కొన్ని సమాఖ్య వ్యవస్థను బలహీనపరచేవిగా ఉన్నాయి. తమ అధీనంలోని ఆదాయపన్ను, ఈడీ, రెవిన్యూ నిఘా లాంటి విభాగాలను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగిస్తున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఇవన్నీ సమాఖ్య వ్యవస్థను విఘాతం కలిగిస్తున్న పరిణామాలే. 70 ఏళ్ల రాజ్యాంగం అమలు నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్త చర్చ అవసరం. అటు దేశ ఐక్యత సమగ్రతలు, ఇటు అధికార వికేంద్రీకరణ, స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య పరిణతి- వీటిని సమన్వయం చేయడం దేశ భవిష్యత్తుకు అవసరం. చైనా లాంటి నియంతృత్వ దేశంలో అధికార వికేంద్రీకరణ విజయవంతంగా జరిగింది.

గత 40 ఏళ్లలో సాధించిన చైనా ప్రగతికి పునాది అధికార వికేంద్రీకరణ, స్థానిక ప్రభుత్వాలు, నిర్ణయాల్లో వెసులుబాటు. వీటి నుంచి ప్రజాస్వామ్య భారతం పాఠాలు నేర్వాలి. సమాఖ్య వ్యవస్థను మరింత బలపరచి, అధికారాన్ని వికేంద్రీకరించి, జవాబుదారీతనాన్ని, పాలన సామర్థ్యాన్ని పెంచడం- దేశ భవిష్యత్తుకు, ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకం!

కేంద్రీకరణ వైపే అడుగులు...

ఇటీవలి కొన్ని పరిణామాలు మరింత అధికార కేంద్రీకరణకు దారితీస్తున్నాయి.

మొదటిది: ప్రణాళిక సంఘం రద్దుతో వచ్చిన నీతిఆయోగ్‌ బలహీన సంస్థగా మారింది. గతంలో ప్రణాళిక సంఘం వృత్తి నైపుణ్యంతో చేసిన కార్యక్రమాలు, వనరుల పంపిణీ ఇప్పుడు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖకు సంక్రమించడంతో మరింత కేంద్రీకరణకు, రాజకీయ పక్షపాతాలకు తావిస్తోంది.

రెండోది: 101వ సవరణతో దేశంలో ఏకమార్కెట్‌ స్థాపన కోసం వచ్చిన వస్తుసేవా పన్ను (జీఎస్టీ) విధానం దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరమని ఆర్థికవేత్తల్లో అత్యధికులు భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాలకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే అమ్మకంపన్ను జీఎస్టీలో విలీనం కావడంతో వనరుల సమీకరణలో రాష్ట్రాలకు వెసులుబాటు మరింత తగ్గింది.

మూడోది:చట్టబద్ధంగా జీఎస్‌టీ వసూళ్ళలో రాష్ట్రాల లోటును పూరించే బాధ్యత కేంద్రానిది. కానీ, దాదాపు లక్ష కోట్ల రూపాయల బకాయిలున్నా కేంద్రం నిధుల్ని విడుదల చేయకపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కార బాధ్యత, అధికారం కేంద్రానికి ఉన్నా, రాజకీయ కారణాలు, అలసత్వాల వల్ల కేంద్రం చొరవ తీసుకోకుండా సమస్యను జటిలం చేస్తోంది.

నాలుగోది: కేంద్ర ప్రతిపాదిత పథకాల పాత్ర పెచ్చరిల్లడం. పథకాల అమలులో కేంద్రం పాత్ర పెరగడం, రాష్ట్రాల వెసులుబాటు తగ్గడం వల్ల సమాఖ్య వ్యవస్థ బలహీనపడుతోంది. రాష్ట్రాల జాబితాలోని అంశాలపైనా రాజకీయంగా తమ ముద్ర బలంగా పడేందుకు మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో రాష్ట్రాలకు పరిపాలనలో చొరవ తగ్గి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం కష్టమవుతోంది.

డాక్టర్​ జయప్రకాశ్​ నారాయణ్​, రచయిత, ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్​డీఆర్​), లోక్​సత్తా వ్యవస్థాపకులు

Last Updated : Feb 18, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details