తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు ప్రతిష్ఠ పెరగాలంటే... అవి పాటించాల్సిందే! - భారత పోలీసులు

భారత దేశంలో పోలీసు వ్యవస్థ ఎంతో ముఖ్యం. పోలీసుల పని పరిస్థితులు, సాధక బాధకాల్ని అర్థం చేసుకోకుండా వారిని విమర్శించడం అన్యాయమని అమిత్‌ షా చెబుతున్నా- క్షేత్ర స్థాయిలో ఖాకీల పనిపోకడలే ఆ వ్యవస్థకు గౌరవ హాని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు! పోలీసు దళంలో వృత్తి సామర్థ్యం కొరవడింది.... శిక్షణ లోపాలు వెక్కిరిస్తున్నాయి. పోలీసు వ్యవస్థకు రాజకీయ చెర వదిలించి, ఖాకీల్లో వృత్తి నైపుణ్యాల్ని జవాబుదారీతనాల్ని పెంచినప్పుడే చట్టబద్ధ పాలనతో పాటు పోలీసుల ప్రతిష్ఠా మెరుగుపడుతుంది

editorial column on police's powers and security
పోలీసు ప్రతిష్ఠ పెరగాలంటే... అవి పాటించాల్సిందే!

By

Published : Feb 17, 2020, 7:18 AM IST

Updated : Mar 1, 2020, 2:12 PM IST

రవై లక్షల పైచిలుకు పోలీసు బలగం అంతర్గత భద్రతా కర్తవ్య దీక్షలో ఉన్న దేశం మనది. నేరగాళ్లు, అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నమై పటుతర సామాజిక భద్రతా సాధనంగా పోలీసు వ్యవస్థ నిర్వర్తించాల్సిన విధి విహిత బాధ్యత అద్వితీయమైనది. ఏ ఒక్కరికీ పోలీసు శత్రువు కాదని, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడే స్నేహితుడిగా అతడిని గౌరవించాలనీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిన్న ఉద్బోధించారు. ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ చేతుల మీదుగా దిల్లీ పోలీస్‌ ఆవిర్భావం గర్వకారణమంటూ స్వాతంత్య్రానంతర కాలంలో 35వేలమంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని అంజలి ఘటించారు. పోలీసుల పని పరిస్థితులు, సాధక బాధకాల్ని అర్థం చేసుకోకుండా వారిని విమర్శించడం అన్యాయమని అమిత్‌ షా చెబుతున్నా- క్షేత్ర స్థాయిలో ఖాకీల పనిపోకడలే ఆ వ్యవస్థకు గౌరవ హాని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు! సంఘటిత నేరగాళ్ల వర్గంగా పోలీసు వ్యవస్థను సాక్షాత్తు సర్వోన్నత న్యాయపాలికే తూలనాడిన సందర్భాలున్నాయి. కంచే చేను మేస్తోందని మానవ హక్కుల సంఘాలూ తలంటేసిన నిదర్శనలెన్నో పోగుపడ్డాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమకు తామే చట్టంగా మారుతున్న ప్రమాదకర ధోరణిని కట్టడి చెయ్యడానికంటూ పలు కమిటీలు వెలువరించిన సూచనలపై దశాబ్దాలుగా సాలీళ్లు గూళ్లు కట్టాయి. అంతెందుకు? మెరుగైన వృత్తి నైపుణ్యం, అంకిత భావం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ఆధునిక శిక్షణ, దర్యాప్తులో సాంకేతికత వినియోగించే కొత్త తరం పోలీసు సమకాలీన సమాజానికి కావాలని ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ సుద్దులు వల్లించారు. ‘స్మార్ట్‌ పోలీసింగ్‌’కు నయా నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ- స్థానిక ప్రజానీకంతో పోలీసులు గట్టి బంధం ముడి వేసుకోవాలని, వారి కష్ట నష్టాలపట్ల సానుభూతితో స్పందించాలని 2015లోనే మార్గ నిర్దేశం చేశారు. ఆ విధమైన మార్పు ఏ కోశానా కనపడకపోబట్టే జన మనంలో పోలీసుల పట్ల దురభిప్రాయం అంతెత్తున మేటవేసింది!

‘పోలీసు దళంలో వృత్తి సామర్థ్యం కొరవడింది.... శిక్షణ లోపాలు వెక్కిరిస్తున్నాయి. పకడ్బందీ పర్యవేక్షణ కరవై అవినీతికీ దాష్టీకానికీ మారుపేరుగా పరువు మాస్తోంది’- ఇవి భారతీయ పోలీసు వ్యవస్థపై నిన్న మొన్నటి ఏ నిపుణుల నివేదికో వెలిగక్కిన నిష్ఠుర నిజాలు కావు; అక్షరాలా 118 ఏళ్ల క్రితం వలస పాలకుల జమానాలో రెండో పోలీస్‌ కమిషన్‌ సారథిగా ఫ్రేజర్‌ చేసిన వ్యాఖ్యలవి! 1861 నాటి పోలీస్‌ చట్టంతో బొడ్డు పేగు బంధం ఇప్పటికీ తెగని దురవస్థతోపాటే, అప్పటి అవకరాలు, అవలక్షణాలూ మరింతగా ఊడలు దిగి విస్తరించాయి. చట్టం ఏం చెబుతోందన్నది పక్కన పెట్టి, అధికార పార్టీ పెద్దల హుకుంనామాకు తలొగ్గడమే ఉన్నత పదవులకు ఉత్కృష్ట సోపానమన్న తెలివిడితో పోలీసు శాఖ పుచ్చిపోయింది. నేరగ్రస్త రాజకీయాల ఉరవడీ పోలీసు విధుల వరసను మార్చేసింది. సామాన్యపౌరుడికి ప్రభుత్వమంటే పోలీస్‌ కానిస్టేబులేనంటూ వారి శిక్షణ, అభివృద్ధి, పని పరిస్థితుల మెరుగుదలపైనా దృష్టి సారించాలని రాష్ట్రపతిగా ప్రణబ్‌ దా చేసిన సూచనకూ మన్నన కొరవడింది! ప్రతి లక్ష జనాభాకు సగటున 222 మంది పోలీసులు ఉండాలన్న ఐక్యరాజ్య సమితి నిర్దేశమే ప్రామాణికమైతే- తీవ్రవాద ముప్పు ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌ వినా మరే రాష్ట్రమూ ఆ దరిదాపుల్లో లేదు. ఇండియాలో పోలీసింగ్‌ స్థాయీ ప్రమాణాలపై నిరుడు ఆగస్టులో వెలుగు చూసిన నివేదిక- సగటున పోలీసులు 14 గంటలపైన విధులు నిర్వహిస్తుంటారని, వారాంతపు సెలవులకూ నోచక శారీరక, మానసిక వేదన అనుభవిస్తున్నారని, ఓవర్‌ టైం పనికి వేతనాలూ ఉండవని స్పష్టీకరించింది. పెద్దవాళ్ల ప్రమేయం ఉన్న కేసుల్లో రాజకీయ జోక్యం అత్యధికమన్న నివేదిక- పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో ప్రతినాయక పాత్ర ఎవరిదో కూడా వెల్లడించింది. ఖాకీ దుస్తులకు గౌరవం పెరగాలంటే, వాటికి సంస్కరణల గంజి పెట్టడం తప్పనిసరి!

దశాబ్దకాలంలో (2005-’15) సగటున లక్ష జనాభాకు నేరాల రేటు 28 శాతం పెరిగిన దేశం మనది. నిరుడు చట్టబద్ధ పాలన సూచీలో మొత్తం 126 దేశాల్లో- ఇండియా 68వ స్థానంలో నిలిచింది. మొత్తం ఎనిమిది ప్రాతిపదికల ఆధారంగా ఇండియా పనితీరు గణిస్తే శాంతి భద్రతల్లో అది 111వ స్థానంలో ఉంది! ‘దాని అర్థం ఇక్కడ చట్టబద్ధ పాలన లేదని కాదు, పాలకుల చట్టం కూడా అమలవుతోంద’ని యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్‌ సింగ్‌ ఆవేదన చెందారు! వెలుపలి ఒత్తిళ్లకు లోబడని విధంగా పోలీసు వ్యవస్థను పరిపుష్టీకరించాలని 1902లోనే తొలిసారి సూచన వెలువడినా, అనంతర కాలంలో ఎన్నెన్నో కమిటీలు దాన్ని పునరుద్ఘాటించినా నేటికీ దాన్ని పట్టించుకొన్న నాథుడు లేడు! గతంలో తమ ఫర్మానాలను పట్టించుకోని వారిని బదిలీలతో వేధించిన నేతాగణాలు, ఇప్పుడు సస్పెన్షన్లు, బెదిరింపులు, తప్పుడు కేసుల బనాయింపుల దాకా బరి తెగిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు! భారతంలో కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో, ఇండియాలో పోలీసు వ్యవస్థ పరువు మాయడానికీ అంతకంటే ఎక్కువే ఉన్నాయి. రాజకీయ బాసుల ఉక్కు పిడికిలినుంచి పోలీసు వ్యవస్థను బయటపడేయడానికి సుప్రీంకోర్టే 2006లో విస్పష్ట మార్గదర్శకాలు ఇచ్చినా- పెద్దగా ప్రయోజనం లేకపోయింది. జన శ్రేయస్సాధకంగా పోలీసు యంత్రాంగాన్ని తీర్చిదిద్దేందుకు లా కమిషన్‌, రెబిరో కమిటీ, పద్మనాభయ్య, జస్టిస్‌ మలీమత్‌ కమిటీల మేలిమి సూచనల అమలు అటకెక్కింది. పోలీసు వ్యవస్థకు రాజకీయ చెర వదిలించి, ఖాకీల్లో వృత్తి నైపుణ్యాల్ని జవాబుదారీతనాల్ని పెంచినప్పుడే చట్టబద్ధ పాలనతో పాటు పోలీసుల ప్రతిష్ఠా మెరుగుపడుతుంది!

Last Updated : Mar 1, 2020, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details