తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోదీ నిర్ణయాలతో సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ"

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్యపు నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని కాంగ్రెస్​ ప్రతినిధి ఆనంద్​ శర్మ ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో భారత ఆర్థిక వృద్ధి మందగించిందని తెలిపారు. తప్పుడు గణాంకాలు చూపి భారత విశ్వసనీయతను దెబ్బతీశారని శర్మ ఆరోపించారు.

మోదీ నిర్లక్ష్య నిర్ణయాలతో ఇబ్బందుల్లో ఆర్థిక వ్యవస్థ

By

Published : Mar 31, 2019, 8:15 AM IST

Updated : Mar 31, 2019, 5:00 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఆనంద్​ శర్మ. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ఆరోపించారు. మోదీ నిర్లక్ష్యపు నిర్ణయాలతోనే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఆర్థికవృద్ధి మందగించిందన్నారు శర్మ.

" తప్పుడు గణాంకాలు చూపి భారత విశ్వసనీయతను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసింది. నిజం ఏమిటంటే ఆయన(మోదీ) పాలనలో భారత ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేకపోయారు. అది ఆర్థిక వృద్ధిని పెంచలేదు, తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్యపు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది."

- ఆనంద్​ శర్మ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

నోట్ల రద్దు వల్ల లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని, దీనికి మోదీ బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు​ శర్మ. ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో దోషపూరిత వస్తు సేవల పన్ను విధానాన్ని తీసుకొచ్చిన ప్రధాని సమాధానమివ్వాలని అన్నారు. అందులో ఒకే దేశం, ఐదు రకాల పన్నులు ఉన్నాయని, రెవెన్యూలో 45 శాతం మినహాయింపు పొందే పన్నులు ఉన్నాయన్నారు. ప్రజలపై భారంగా, క్లిష్టంగా జీఎస్టీ మారిందని తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థకు నాలుగు ఇంజిన్లయిన.. పెట్టుబడి, తయారీ రంగం, ఎగుమతులు, మూలధన సమీకరణలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు.

ప్రధాని మోదీని, ఆయన ప్రభుత్వాన్ని దండించే సమయం వచ్చిందని తెలిపారు. లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నీతి ఆయోగ్​ను తొలగించి ప్రణాళిక సంఘాన్ని తిరిగి తీసుకొస్తామని తెలిపారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఆనంద్​ శర్మ.

ఇదీ చూడండి:'కాంగ్రెస్​ 'న్యాయ్​'ను ఎదుర్కొనేదెలా?'

Last Updated : Mar 31, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details