ఓటర్లకు 'రిమోట్ ఓటింగ్' సౌకర్యం కల్పించే దిశగా మాక్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభమవుతాయని.. భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానంతో 'రిమోట్ ఓటింగ్'పై పరిశోధన ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని తెలిపారు. ఈ మేరకు '11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని' పురస్కరించుకొని ఇచ్చిన సందేశంలో వివరాలు వెల్లడించారు.
"ఈ విషయంలో మంచి పురోగతి ఉంది. మాక్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభమవుతాయి" అని సీఈసీ స్పష్టం చేశారు. విదేశీ భారతీయ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని విస్తరించే అంశంపై.. పోస్టల్ ప్యానల్ చేసిన ప్రతిపాదననూ న్యాయ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన 'బ్లాక్‌చైన్ టెక్నాలజీ' గురించి మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా గతంలోనే వెల్లడించారు. 'పూర్తి నియంత్రిత విధానంలో టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ ఇందులో నిక్షిప్తమై ఉంటుందని' ఆయన తెలిపారు.