మహారాష్ట్రలో శాసన మండలి ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది ఎన్నికల సంఘం. ఈనెల 21న ముంబయిలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఈసీ.
ముఖ్యమంత్రి పదవి చేపట్టి 6 నెలలు పూర్తయ్యేలోగా శాసన మండలికి ఎన్నికవ్వాలని చూస్తోన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నిర్ణయం ఊరట కలిగించింది.
ఈసీకి గవర్నర్ లేఖ..
గత ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఉద్ధవ్ ఠాక్రే. సీఎంగా బాధ్యతలు కొనసాగించాలంటే.. శాసన సభ లేదా శాసన మండలికి ఆరు నెలల్లోపు ఎన్నికవాల్సి ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రేకు ఈనెల 27 వరకే గుడవు ఉంది. ఒక వేళ ఏ పదవికి ఎన్నిక కాకపోతే సీఎం పదవిని వదులుకోవాల్సి వస్తుంది.
మార్చి 26న జరగాల్సిన మండలి ఎన్నికలు.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. సమీప భవిష్యత్లో పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి సంకేతాలు కనిపించపోగా... రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెర లేపుతున్నారని బుధవారం ఆరోపించారు ఉద్ధవ్. ఈ విషయమై అదే రోజు ఫ్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కలుగజేసుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధానితో ఉద్ధవ్ మాట్లాడిన మరుసటి రోజే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి శాసన మండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరారు. అందుకు అనుగుణంగా నేడు ప్రకటన చేసింది ఈసీ.