సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా భారత ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలకు షోకాజు నోటీసులు జారీచేసింది. వారి జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో ఆగష్టు 5లోగా వివరించాలని కోరింది.
2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ 6 సీట్లు సాధించగా.... ఈసారి ఎన్నికల్లో మాత్రం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికలపడింది.
ఇదే విధంగా... 2014 ఎన్నికల్లో 34 లోక్సభ సీట్లు సాధించి విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్... తాజా ఎన్నికల్లో కేవలం 22 సీట్లు మాత్రమే సాధించగలిగింది.
కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన సీపీఐ... తాజా ఎన్నికల్లో రెండు సీట్లు సాధించింది. కానీ పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వీటి జాతీయ పార్టీ హోదాకు ముప్పు ఏర్పడింది.
నియమాలు మారాయి..
2014 లోక్సభ ఎన్నికల్లో ఘోరపరాజయం మూటకట్టుకున్న సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. అయితే 2016లో ఎన్నికల కమిషన్.. నియమాలను సవరించడం వల్ల ఆయా పార్టీలకు ఉపశమనం కలిగింది. రాజకీయ పార్టీల జాతీయ హోదాను ప్రతి ఐదు సంవత్సరాలకు బదులుగా ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించాలని నిర్ణయించేందుకు నిర్ణయం తీసుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 లోక్సభ సీట్లు, కొన్ని అసెంబ్లీ సీట్లు సాధించిన 'బహుజన్ సమాజ్ పార్టీ' (బీఎస్పీ) జాతీయ హోదాను నిలబెట్టుకోగలిగింది.