ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్ యంత్రాల్లో లోపాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఒక వేళ ఫిర్యాదు నిజం కాదని తేలితే ఫిర్యాదుదారుడిపై కేసు పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది భారత శిక్షాస్మృతిలోని 177వ సెక్షన్. తాజాగా ఈ నిబంధనను పున:పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయినందున అంతర్గతంగా చర్చించుకుని నిబంధనను సరళీకరించడంపై దృష్టి సారిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా తెలిపారు. ఐపీసీ 177 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు తప్పు అని తేలితే గరిష్ఠంగా 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించేందుకు అవకాశం ఉంది.