భారత ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగాల్లో ప్రచార గడువును కుదించడం అన్యాయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆక్షేపించారు. ఈ చర్యతో ప్రజల్లో ఈసీ విశ్వసనీయత కోల్పోయిందని ఉద్ఘాటించారు.
"భారత ఎన్నికల సంఘం తన స్వతంత్రత, రాజ్యాంగ సమగ్రతను కోల్పోయిందని చెప్పేందుకు చింతిస్తున్నాం. బంగాల్లో 20 గంటల ముందే ప్రచారంపై నిషేధం విధించటం ప్రజాస్వామ్య చరిత్రలో మచ్చగా మిగిలిపోతుంది. రాజ్యాంగంలోని 324 అధికరణను దుర్వినియోగం చేసింది. 14, 21 అధికరణలను ఉల్లంఘించింది. ప్రధాని మోదీకి బహుమతిగా ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చింది."