భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈసీ ఝలక్ భోపాల్ నుంచి భాజపా లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 3 రోజుల (72 గంటలు) పాటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) మాజీ విభాగాధిపతి హేమంత్ కర్కరే, బాబ్రీ మసీదు వ్యవహారంలో సాధ్వి చేసిన ఆరోపణలపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫలితంగా ఆమెను 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా చూసుకోవాలని సూచించింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచినిషేధం వర్తిస్తుందని తెలిపింది ఎన్నికల సంఘం.
సాధ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు
మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో... మాజీ ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సాధ్వి. అలాగే ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా మతపరమైన వ్యాఖ్యలూ చేశారు. 1992లో అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై సాధ్వి వివరణ ఇచ్చినప్పటికీ ఈసీ నిషేధం విధించింది. మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసు నిందితురాలిగా జైలు జీవితం కూడా గడిపారు సాధ్వి.
ఇదీ చూడండి : మూడు మాడ్యూళ్లతో చంద్రుడిపైకి చంద్రయాన్-2...!