సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయంగా వివాదాస్పదమైన 'పీఎం నరేంద్రమోదీ' సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. విడుదల తేదీకి ఒక్కరోజు ముందే అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సమయంలో రాజకీయ నేతల బయోపిక్‌లు విడుదల చేయరాదని స్పష్టం చేసింది ఈసీ. రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితకథ ఆధారంగా తీసిన ఉద్యమసింహం చిత్రాలకు ఇదే వర్తిస్తుందని తెలిపింది ఈసీ.
విడుదల ముందు రోజే...
వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో, ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో మోదీ జీవిత కథ ఆధారంగా 'పీఎం నరేంద్రమోదీ' సినిమా తెరకెక్కింది. ఎన్నికల వేళ ప్రజల ఆలోచనలను మోదీ బయోపిక్ చిత్రం ప్రభావితం చేసే అవకాశం ఉందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. న్యాయ పోరాటానికి దిగాయి. విడుదలను నిలిపివేయాలని ఓ కాంగ్రెస్ కార్యకర్త వేసిన వ్యాజ్యాన్ని సుప్రీం తోసిపుచ్చింది. ఈసీదే తుది నిర్ణయమని తేల్చిచెప్పింది.