వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్-చైనా మధ్య మూడో విడత లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి భేటీ మంగళవారం జరగనుంది. ఈ నెల 6, 22వ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరళ్లు చర్చలు జరపగా.. ఈ సారి భారత్ వైపు ఉన్న చుషుల్‌లో ఇరువురు సమావేశంకానున్నారు.
గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత.. ఈ నెల 22న జరిగిన భేటీలో వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాలను ఉపసంహరించాలని భారత్, చైనా ఓ అంగీకారానికి వచ్చాయి. ఈసారి భేటీలో తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించే దిశగా విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే మార్గాలపై మంగళవారం జరగనున్న భేటీలో చర్చించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ భేటీ ప్రారంభంకానుంది.