తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడే భారత్-చైనా లెఫ్టినెంట్ జనరల్​ల భేటీ - భారత్ చైనా భేటీ

తూర్పు లద్ధాఖ్​లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్​, చైనా సైనిక ఉన్నతాధికారులు ఇవాళ భేటీ కానున్నారు. అత్యంత అరుదుగా నిర్వహించే లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయి సమావేశం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సంప్రదింపుల్లో వివాదం చెలరేగిన ప్రాంతాల నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని భారత్​ పట్టుబట్టే అవకాశం ఉందని సైనిక వర్గాలు తెలిపాయి.

eastern-ladakh-stand-off
భారత్ చైనా భేటీ

By

Published : Jun 6, 2020, 5:31 AM IST

సరిహద్దులో ఉద్రిక్తతల మధ్య భారత్​, చైనా సైన్యాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు ఈ రోజు జరగనున్నాయి. తూర్పు లద్ధాఖ్​లో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా ఈ భేటీతో రెండు దేశాలు తొలి అడుగు వేయనున్నాయి.

భేటీ ఎక్కడ జరుగుతుంది?

తూర్పు లద్ధాఖ్​లోని చుశూల్​ సమీపంలోని మాల్డోలో ఉదయం 8 గంటలకు ఈ భేటీ జరగనుంది. భారత్​ తరఫున బృందానికి లేహ్​లోని 14 కార్ప్స్​ జనరల్​ కమాండర్​, లెఫ్టినెంట్ జనరల్​ హరీందర్ సింగ్​ నేతృత్వం వహించనున్నారు. టిబెట్​ మిలిటరీ కమాండర్​ చైనా తరఫున నాయకత్వం వహిస్తారు.

ఈ భేటీతో సమస్య పరిష్కారమవుతుందా?

ఈ సమావేశం వల్ల ఎలాంటి దృఢమైన ఫలితాలను భారత్​ ఆశిస్తున్నట్లు లేదని విశ్వసనీయవర్గాల సమాచారం. కానీ, అత్యంత అరుదైన ఈ ఉన్నతస్థాయి సైనిక సమావేశం ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్గం ఏర్పరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక కమాండర్ల మధ్య 12 సార్లు చర్చలు జరిగాయి. మేజర్ జనరల్ స్థాయి అధికారులు 3 సార్లు భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల ద్వారా ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదని తెలుస్తోంది.

ఈ భేటీలో చర్చకు వచ్చే అంశాలేంటి?

శనివారం జరిగే ఈ సమావేశంలో భారత్​ కీలకమైన అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్యాంగాంగ్​ సో, గాల్వన్​ లోయలో పూర్వస్థితికి వచ్చేలా చైనా వెనుదిరగాలని నొక్కి చెప్పే అవకాశం ఉంది. ఇరువర్గాల మధ్య మే 5న జరిగిన ఘర్షణల తర్వాత చైనా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ క్యాంపులను తొలగించాలని సూచించనుంది.

2018 ఏప్రిల్‌లో వుహాన్‌లో జరిగిన తొలి అనధికారిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేయాలని భారత్​ పట్టుబడుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. 2017లో డోక్లాం పరిణామాల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు సంబంధించి దౌత్య చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వుహాన్​ భేటీ జరిగింది.

భారత విదేశాంగ శాఖ ఏమంటోంది?

ఇరువైపులా విభేదాలు, ప్రస్తుత పరిణామాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ తాజా ప్రకటనలో తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డీజీ వూ జియాంజావోతో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్​ శ్రీవాస్తవ చర్చించారు.

ఇదీ చదవండి:సైనికాధికారుల భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు

రెండు దేశాలు పరస్పర సున్నితమైన అంశాలు, ఆందోళనలు, ప్రయోజనాలు గౌరవించాలని నిర్ణయించినట్లు విదేశాంగ ప్రకటనలో తెలిపింది. ఈ అంశాలపై వివాదాలు సృష్టించకూడదని అంగీకారానికి వచ్చాయని స్పష్టం చేసింది.

ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఏం చెబుతున్నాయి?

భారత్​- చైనా మధ్య 2013 అక్టోబర్​లో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (బీడీసీఏ) కుదిరింది. దీని ప్రకారం ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు మిలిటరీ థియేటర్లను పరస్పరం సందర్శిస్తారు. ఈ ఏడాది జనవరి 8, 9 తేదీల్లో చివరిసారిగా ఈ పర్యటన జరిగింది.

ఉత్తర కమాండ్​ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్​బీర్​ సింగ్​.. పీఎల్​ఏ జనరల్ హన్​ వెంగ్​వో, జనరల్ ఝావో ఝొగ్​షీ (వెస్ట్రన్​ థియేటర్ కమాండ్ సారథి)ని కలిశారు.

భారత్​తో సరిహద్దు బాధ్యతలు చూసుకునేది వెస్ట్రన్​ థియేటర్ కమాండ్ (డబ్ల్యూటీసీ). అంతకుముందు 2018 జులై మొదటివారంలో డబ్ల్యూటీసీలో రెండో కీలక అధికారి లెఫ్టినెంట్ జనరల్ లియూ షియావూ భారత్​లో పర్యటించారు.

వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన యంత్రాంగాలు ఏం చేస్తాయి?

3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో వివాదాల పరిష్కారానికి విశ్వసనీయత పెంపు చర్యలు (సీబీఎం) కింద 5 సూత్రాల అమలుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఘర్షణలను తగ్గించేందుకు బీడీసీఏ కింద ఇప్పటివరకు అనేక సీబీఎం యంత్రాంగాలను అమలు చేశారు. కమాండర్లు, ప్రభుత్వ అధికారుల మధ్య పతాక సమావేశాలు నిర్వహించారు.

భారత్- చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి సంప్రదింపులు, సహకారం కోసం కార్యచరణ యంత్రాంగాన్ని(డబ్ల్యూఎంసీసీ) రూపొందించారు. ఇది సంయుక్త కార్యదర్శి, సరిహద్దు వ్యవహారాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో జరుగుతుంది. వార్షిక రక్షణ చర్చలు మాత్రం రక్షణ శాఖ కార్యదర్శి స్థాయిలో జరుగుతాయి.

చర్చల ముందు కమాండర్​ మార్పు ఎందుకు?

భారత్​తో చర్చలకు సిద్ధమైన చైనా.. సరిహద్దు​లోని వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​ బలగాలకు కొత్త కమాండర్​ను నియమించింది. ఇరుదేశాల సైనికాధికారుల మధ్య భేటీకి ముందు ఈ చర్య.. చర్చనీయాంశంగా మారింది.

లెఫ్టినెంట్​ జనరల్​ జు క్విలింగ్​ను కొత్త కమాండర్​గా నియమించినట్లు పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) తన అధికారిక వెబ్​సైట్​ ద్వారా తెలియజేసింది. భారత్​తో ఉన్న సరిహద్దు ప్రాంతాలను నిర్వహించేది ఈ కమాండే కావడం గమనార్హం.

అసలు ఏం జరిగింది?

తూర్పు లద్ధాఖ్​లో రహదారుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న చైనా సరిహద్దుల వెంబడి బలగాలను మోహరించింది. చైనాకు దీటుగా సరిహద్దుల్లో సైన్యాన్ని తరలించింది భారత్. ఫలితంగా లద్ధాఖ్​లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఇరు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి.

ఇదీ చదవండి:భారత్​- చైనా సైనికాధికారుల భేటీలో కీలక అంశాలివే!

లద్ధాఖ్​లోని పాంగ్యాంగ్​ సరస్సు వద్ద భారత సైన్యం, ఐటీబీటీ బలగాలతో మే 9న చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు ఘర్షణకు దిగారు. అనంతరం మే 22న మరోసారి గొడవ పడ్డారు. రెండువైపులా దాదాపు 100 మంది గాయపడ్డారు. అంతకముందు మే 5, 6 తేదీల్లో ఉత్తర సిక్కింలో రెండు వర్గాలు తలపడ్డాయి. ఈ ఘర్షణల తర్వాత మరింతగా బలగాలను పెంచాయి రెండు దేశాలు. ఆర్టిలరీ గన్స్​తోపాటు భారీ వాహనాలను తరలించాయి.

వివాదం చెలరేగిన ప్యాంగాంగ్​ సో, గాల్వన్​ లోయ, దెమ్​చోక్​, దౌలత్​ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో గట్టిగా బదులివ్వాలని భారత్​ సైన్యం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

చైనా ఏ స్థాయిలో బలగాలను మోహరించింది?

పాంగ్యాంగ్​, గాల్వన్ ప్రాంతాల్లో చైనా 2,500 మంది సైనికులను మోహరించింది. తాత్కాలిక సదుపాయాలు, ఆయుధాలను చేరవేసింది. పాంగ్యాంగ్​ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక వైమానిక స్థావరంలో నిర్మాణ కార్యకలాపాలతో సహా సరిహద్దులో చైనా రక్షణ మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచింది. శాటిలైట్​ చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

లద్ధాఖ్​తో పాటు ఉత్తర సిక్కిం, ఉత్తరాఖండ్​లోని వాస్తవాధీన రేఖ వద్ద కూడా చైనా తన బలగాలను మోహరిస్తోంది. చైనాకు దీటుగా భారత్​కూడా ఈ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలించినట్లు తెలుస్తోంది.

చైనా దూకుడుకు కారణాలేంటి?

తూర్పు లద్ధాఖ్​లో భారత్​ నిర్మిస్తోన్న రహదారులే చైనా కంటగింపునకు కారణంగా తెలుస్తోంది. గాల్వన్ లోయలోని డార్బుక్-షయోక్​-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని అనుసంధానించే మరో రహదారిని నిర్మిస్తోంది భారత్​. ఇదే కాకుండా పాంగ్యాంగ్​​ సరస్సు చుట్టూ ఉండే ఫింగర్ ప్రాంతంలో కీలక రహదారిని నిర్మించ తలపెట్టింది. ఈ రహదారుల నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ రహదారులతో భారత్​కు ఏం లాభం?

సైనికులు పూర్తిస్థాయి గస్తీ నిర్వహించేందుకు ఫింగర్​ ప్రాంతంలో నిర్మించే రహదారి భారత్​కు చాలా కీలకం కానుంది. చైనా నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చినా తూర్పు లద్ధాఖ్​లోని రహదారుల నిర్మాణాన్ని నిలిపేయకూడదని భారత్​ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్​లో చైనా సైనికులు హద్దు మీరే ప్రాంతాల్లోకి భారీగా బలగాలు, వాహనాలు, ఆర్టిలరీ గన్స్​ పంపాలని స్పష్టం చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:సరిహద్దులో చైనా దూకుడుకు కారణం ఇదేనా?

భారత్​ చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దక్షిణ టిబెట్​లో అరుణాచల్​ ప్రదేశ్​ భాగమని చైనా వాదిస్తుండగా.. భారత్​ విభేదిస్తోంది. సరిహద్దు సమస్యకు తుది పరిష్కారం లభించని నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని ఇరు పక్షాలు నొక్కి చెబుతున్నాయి.

ఇదీ చూడండి:సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

ABOUT THE AUTHOR

...view details