తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 7వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఈ భేటీలో సరిహద్దుల్లో బలగాలను పూర్తిస్థాయిలో, సత్వరం ఉపసంహరించటంపై భారత్ ఒత్తిడి పెంచనుందని అధికార వర్గాలు తెలిపాయి. అందుకు తగిన వ్యూహాలతో సిద్ధమైనట్లు వెల్లడించాయి.
మధ్యాహ్నం 12 గంటలకు..
భారత్ వైపు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి (ఎల్ఏసీ) చుషుల్ ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి లేహ్‌లోని 14 కార్ఫ్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో లెప్టినెంట్ జనరల్ పీజీకే మెనన్, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పుఆసియా) నవీన్ శ్రీవాస్తవ సహా పలువురు అధికారులు ఉన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవటానికి రోడ్‌మ్యాప్ ఖరారు చేయటమే ఈ భేటీ ప్రధాన అజెండ అని అధికారవర్గాలు తెలిపాయి.
" అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిస్థాయిలో, సత్వరం ఉపసంహరించుకోవాలని భారత్ మరోమారు ఒత్తిడి పెంచనుంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి చైనా సైన్యంపై బాధ్యత ఉంది. ఈ చర్చల్లో భాగంగా సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కొనసాగించటం, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు పాల్పడకుండ ఉండేందుకు మరిన్ని చర్యలు చేపట్టటంపై ఇరువైపులా పరిశీలించే అవకాశం ఉంది."
- అధికారవర్గాలు