తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ-సిగరెట్లు': సమగ్ర నిషేధమే జాతిహితం..! - ధూమపానం

కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత ప్రాణాంతక వ్యసనాలకూ ఆధునిక హంగులు అద్దుతోంది. చుట్ట.. బీడీ.. సిగరెట్‌.. పేరు ఏదైతేనేం- జనజీవితాల్ని పొగచూరిపోయేలా చేస్తున్న ధూమ కాష్టాలకు నయా అవతారంగా ఈ- సిగరెట్లు యువతరం బతుకులతో చెలగాటమాడుతున్నాయి. ప్రస్తుతం.. ఈ-సిగరెట్లు సహా సంబంధిత ఉత్పత్తులపై కేంద్రం నిషేధాస్త్రం సంధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టం తీసుకొచ్చి.. భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా మోదీ ప్రభుత్వం సంసిద్ధమైందని సమాచారం.

'ఈ-సిగరెట్లు': సమగ్ర నిషేధమే జాతిహితం..!

By

Published : Sep 13, 2019, 5:55 AM IST

Updated : Sep 30, 2019, 10:15 AM IST

భయానక క్యాన్సర్‌ సహా పలు వ్యాధులకు కారణభూతమయ్యే పొగాకు ఉత్పాదనల వినిమయాన్ని తగ్గించేలా జన జాగృత కార్యక్రమాలకు ప్రభుత్వాలు నిబద్ధత చాటుతుంటే, భావితరాల్ని బుట్టలో వేసుకునేలా ఈ సిగరెట్ల ఉరవడి ప్రజారోగ్యానికి పెనుసవాళ్లు రువ్వుతోంది. ఆ ముప్పును సమర్థంగా కాచుకొనేందుకు ఈ-సిగరెట్లు సహా సంబంధిత ఉత్పాదనల తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, ప్రకటనలను నిషేధించి, ఉల్లంఘనలను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్‌) జారీకి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ రెండో విడత పాలన తొలి వంద రోజుల అజెండాలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేయదలచిన కీలకాంశమిది!

శీతాకాల భేటీలో నెగ్గించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లు అనుసారం- తొలిసారి ఉల్లంఘనకు పాల్పడిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష, మళ్లీ నేరానికి పాల్పడితే మూడేళ్ల జైలుశిక్ష, అయిదు లక్షల జరిమానా విధించాలన్న కేంద్రం, ఈ-సిగరెట్లను నిల్వ చేసినా ఆర్నెల్ల ఖైదు, రూ.50 వేల జరిమానాను ప్రతిపాదిస్తోంది.

ఏటా 12 లక్షల మంది..!

దాదాపు 27 కోట్ల మంది పొగాకు వినియోగదారులతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఇండియాలో ఏటా కనీసం 12 లక్షల మంది ‘పొగాకు’ సంబంధ వ్యాధులకు బలైపోతున్నారు. పొగాకు వ్యతిరేక ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులు సత్వరం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కోరుతుంటే, అలాంటి కఠిన చట్టం వేలమంది కార్మికుల పొట్టకొడుతుందని పరిశ్రమ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు. ఈ-సిగరెట్లలోని నికొటిన్‌ దుష్ప్రభావం జనారోగ్యాన్ని చావుదెబ్బ తీస్తుందంటూ కేంద్ర సర్కారు తెస్తున్న ఆర్డినెన్స్‌ స్వాగతించదగిందే అయినా, అంతకు ఎన్నో రెట్లుగా సామాజిక సంక్షోభం సృష్టిస్తున్న పొగాకును ఉపేక్షించడం బేసబబు!

క్యాన్సర్​కు కారణం...

ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కబళిస్తున్న పొగాకు- అక్షరాలా నిశ్శబ్ద హంతకి! నికొటిన్‌తోపాటు ఏకంగా ఏడువేల రకాల విషతుల్యాలుండే పొగాకును ఏవిధంగా వినియోగించినా రక్తంలో కలసి ఒళ్లంతా వ్యాపించే రసాయనాలు పలు క్యాన్సర్లకు కారణమవుతాయి. సాధారణ రకాలతో పోలిస్తే ఈ-సిగరెట్లు 95 శాతం తక్కువ హానికరమని, ధూమపానం మానలేక ప్రాణం మీదకు తెచ్చుకొంటున్న ఎంతోమంది అభాగ్యులకు అవి ఎంతగానో అక్కరకొస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి.

సిగరెట్‌ పెట్టెల మీద ప్రకటనలకు భయపడి వాటికి దూరంగా ఉంటున్న యువతకు ‘అంతగా హానికరం కాదన్న’ ఆకర్షణీయ ప్రకటనలతో ఈ-సిగరెట్లు ధూమపాన ద్వారాలు తెరిచి, మరింత ‘కిక్కు’ కోసం వాళ్లు సాధారణ రకాలవైపు మళ్ళేలా చేస్తున్నాయని ఆరోగ్యశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దేశీయంగా 460కి పైగా బ్రాండ్ల ఈ-సిగరెట్లలో నికొటిన్‌ మూలకానికి 7,700 పైగా రుచులు అద్ది యువతరాన్ని ఆకట్టుకొంటున్న తీరు అక్షరాలా జాతీయ ఉపద్రవమే!

ఈ సిగరెట్ల విపణి జోరుకు అడ్డు...

ఈ-సిగరెట్లలోని సాంకేతికత ద్రవరూప నికొటిన్‌ను ఆవిరిగా మారిస్తే, వినియోగదారులు దాన్ని పీలుస్తారంటున్న భారతీయ వైద్య పరిశోధనా మండలి- పలు అధ్యయనాల్ని ఉటంకిస్తూ అదెంత ప్రాణాంతకమో వివరిస్తూ వెలువరించిన శ్వేతపత్రంలోని సూచనలు శిరోధార్యమే. సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ద్వారా ఈ-సిగరెట్లను నిషేధించే అవకాశం లేకపోవడంతో దాన్ని ‘ఔషధం’గా గుర్తించి డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం కింద కేంద్రం తాజాగా నిషేధాస్త్రం సంధిస్తోంది. అంతర్జాలంలో ఈ సిగరెట్ల విపణి జోరును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎలా కట్టడి చెయ్యగలవో చూడాలి!

పదహారేళ్ల క్రితం నాటి ప్రపంచ ఆరోగ్య సదస్సు, ఈ-సిగరెట్ల వినిమయాన్ని నియంత్రించడమో, నిషేధించడమో చేయాలని సభ్యదేశాలకు గట్టిగా సూచించింది. పొగాకు నియంత్రణ మార్గదర్శక పత్రంపై సంతకం చేసిన ఇండియా, ఈ సిగరెట్లపై వేటు వెయ్యడానికే నిర్ణయించింది. సాధారణంగా ధూమపానం వల్ల కలిగే అనర్థాలను దూరం చెయ్యడానికి ప్రత్యామ్నాయంగా బ్రిటన్‌, న్యూజిలాండ్‌ వంటివి ఈ-సిగరెట్లను ఆదరిస్తున్నాయన్న పరిశ్రమ వర్గాల వాదనను పట్టించుకోవాల్సిన పని లేదు. బ్రెజిల్‌, నార్వే, సింగపూర్‌ వంటి పాతిక దేశాలు వాటిని నిషేధించిన నిజాన్ని విస్మరించకూడదు.

నిషేధించే యోచనలో అమెరికా...

ప్రపంచవ్యాప్తంగా నిరుడు రూ.80 వేల కోట్లుగా ఉన్న ఈ-సిగరెట్‌ విపణి, 2024 నాటికి లక్షా 30 వేల కోట్ల రూపాయలకు చేరుతుందన్న అంచనాలున్నాయి. సాధారణ సిగరెట్లకు ఎదురుగాలి పోటెత్తుతున్న నేపథ్యంలో ఆ బడా సంస్థలే మెరుగైన ప్రత్యామ్నాయం పేరిట ఈ ఉత్పాదనల్ని ప్రపంచం మీదకు వదులుతున్నాయి. అమెరికాలోని 33 రాష్ట్రాల్లో 450 మంది ఊపిరితిత్తుల వ్యాధి పాలవడానికి, ఆరుగురి మరణాలకు కారణమయ్యాయంటూ ట్రంప్‌ ప్రభుత్వం సైతం వాటిని నిషేధించే యోచన చేస్తోంది.

పొగాకు మోగిస్తున్న మరణమృదంగ ధ్వని ఇండియాలో సంక్షేమ రాజ్య భావనకే నిలువునా తూట్లు పొడుస్తున్నా పొగాకు ఉత్పాదనల సమగ్ర నిషేధంపై ప్రభుత్వాలు వెనకాడటం ఏమిటి? దేశవ్యాప్తంగా 60 లక్షల మంది పొగాకు రైతుల్ని జాగృతపరచి తగు ప్రోత్సాహకాలు అందించి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడంతో మొదలుపెట్టి, ఆయా కర్మాగారాల్లో శ్రామికులకు, బీడీ కార్మికులకు కొత్తదారి చూపించేలా ప్రభుత్వాల కార్యాచరణ సమగ్రం కావాలి. పొగాకు కాలుష్య విషధూమాన్ని చెదరగొట్టే క్రియాశీల చొరవే నేడు కావాల్సింది!

ఇదీ చూడండి:'మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంది'

Last Updated : Sep 30, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details