సరిహద్దు ఘర్షణలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. 20 మంది వరకు భారత జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. భారత అధికారుల లెక్కల ప్రకారం చైనా వైపు మృతులు, గాయపడినవారు 43 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏఎన్ఐ వార్త సంస్థకు సమాచారం అందింది.
సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి
21:59 June 16
21:48 June 16
- భారత్-చైనా ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికుల మృతి చెందినట్లు సమాచారం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
- నిన్న రాత్రి తూర్పు లద్దాఖ్ గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ
- చైనా వైపు కూడా సైనిక నష్టం జరిగింది: భారత ప్రభుత్వ వర్గాలు
- చైనా సైనికులు ఎంతమంది చనిపోయారో కచ్చితంగా తెలియదు: భారత ప్రభుత్వ వర్గాలు
20:23 June 16
సరిహద్దు వద్ద ఉద్రిక్తతపై భారత విదేశాంగశాఖ స్పందించింది.
"ఈ నెల 15 సాయంత్రం-రాత్రి సమయంలో .. ఏకపక్ష ధోరణితో సరిహద్దులో పరిస్థితులను మార్చడానికి చైనా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్-చైనా బలగాల మధ్య హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఇరు వైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనుకున్న విధంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించి ఉంటే.. సైనికుల ప్రాణాలను కాపాడుకోగలిగేవాళ్లం. సరిహద్దులో శాంతి నెలకొల్పడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ అనుకుంటోంది. అదే సమయంలో తన సార్వభౌమాధికారానికి ఎలాంటి నష్టం కలుగకుండా చూసుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది. సరిహద్దు నిర్వహణపై వస్తున్న ప్రశ్నలకు ఒకటే సమాధానం. భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా.. అవి వాస్తవాధీన రేఖ వెలుపలే ఉంటాయి. చైనా కూడా ఇలా ఉండాలని భారత్ కోరుకుంటోంది"
-- భారత విదేశాంగ శాఖ ప్రకటన.
19:21 June 16
భారత్-చైనా ఉద్రిక్తతల నడుమ అధికారులు జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఇదివరకే రక్షణమంత్రి కీలకాధికారులతో రెండుసార్లు భేటీ అవగా.. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖతో జరిగిన భేటీకి హాజరయ్యారు ఇండో-టిబెట్ సరిహద్దు పొలీసు డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్. భారత్-చైనా సరిహద్దులో గస్తీ కాస్తున్న భారత సైనిక సిబ్బంది కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
18:05 June 16
రాజ్‌నాథ్ రెండోసారి భేటీ
సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్, త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైనికాధికారి నరవాణెతో భేటీ అయ్యారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ ముగ్గురితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ అవ్వడం ఇవాళ ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందే ప్రస్తుత పరిస్థితులను ప్రధానికి వివరించారు రాజ్‌నాథ్.
15:40 June 16
చైనా నిరసన..
- సరిహద్దుల్లో ఘర్షణపై భారత్‌కు నిరసనను తెలియజేసిన చైనా
- దౌత్య ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉండాలి: చైనా విదేశాంగశాఖ
- సరిహద్దుల్లోని భారత్ బలగాలు సంయమనం పాటించాలి: చైనా విదేశాంగశాఖ
- భారత్ బలగాలు తమ సరిహద్దులను అతిక్రమించవద్దు: చైనా విదేశాంగశాఖ
14:59 June 16
ఘర్షణలో చైనా సైనికులూ మరణించారు: గ్లోబల్ టైమ్స్
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో.. కొందరు చైనా సైనికులు కూడా మరణించినట్లు ఆ దేశ వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
14:45 June 16
ఉద్రిక్తతల వేళ ప్రధానితో రక్షణమంత్రి భేటీ
మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు. సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ కంటే ముందే ఆయన ప్రధానితో సమావేశమై సరిహద్దుల్లోని పరిస్థితిని వివరించనున్నారు. మరోవైపు భారత సైన్యాధిపతి ముకుంద్ నరవాణే పఠాన్‌కోట్ మిలటరీ స్టేషన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
14:37 June 16
సరిహద్దు వివాదాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రక్షణమంత్రి
వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన వివాదం గురించి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరించారు. మరికాసేపట్లో ఆయన ప్రధానితో స్వయంగా భేటీ కానున్నట్లు సమాచారం.
14:02 June 16
చైనా బుకాయింపు...
తన తప్పును కప్పిపుచ్చుకొనే దిశగా ప్రయత్నిస్తోంది చైనా. భారత సైనికులే తమ వైపు వచ్చి దాడి చేశారని ఆరోపించారు.
14:01 June 16
ఇరువైపులా ప్రాణనష్టం...
గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాల మేజర్ జనరళ్లు సమావేశమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇరు వైపులా ప్రాణనష్టం సంభవించిందని తెలిపాయి.
13:40 June 16
రాజ్‌నాథ్ అత్యవసర సమావేశం..
భారత్-చైనా సరిహద్దులో తాజాగా నెలకొన్న పరిస్థితిపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రిదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్‌తో అత్యవసర భేటీ అయ్యారు. ప్రస్తుత ఘటనపై భారత్ ఎలా స్పందించాలనే అంశమై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.
13:24 June 16
తూర్పు లద్దాక్‌లో భారత సైన్యంతో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరింత తెగించింది. లద్దాక్‌లోని గాల్వన్‌లోయ వద్ద భారత సైన్యంపై దాడి చేసింది. చైనాతో కుదిరిన అంగీకారం మేరకు సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఓ కమాండింగ్ అధికారి సహా మొత్తం ముగ్గురు భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు సమావేశమయ్యారు.
వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామంటూనే చైనా దారుణానికి ఒడిగట్టింది. తమ తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసిన చైనా.. భారత సైనికులే సరిహద్దు దాటి తమపై దాడికి దిగారని ఆరోపించింది.
చైనా విదేశాంగ శాఖ జోక్యం..
గతరాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణపై స్పందించింది చైనా విదేశాంగ శాఖ. ఏకపక్ష చర్యలకు దిగి సమస్యను మరింత జటిలం చేయకూడదని పేర్కొంది. భారత సైనికుల మరణంపై ఆరా తీసింది. ఈ మేరకు రాయిటర్స్ వెల్లడించింది.
ఇదీ నేపథ్యం
తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించిన అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాకు దీటుగా భారత్ కూడా బలగాలను మోహరించింది. పలు దఫాల చర్చల అనంతరం సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇరుదేశాల సైనికాధికారులు అంగీకరించారు. అంతలోనే గతరాత్రి మరోసారి ఉద్రిక్తతలు తలెత్తి ముగ్గురు భారత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
13:00 June 16
సరిహద్దులో చైనా ఘాతుకం.. ముగ్గురు భారత జవాన్లు మృతి
భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. సైన్యాన్ని వెనక్కితీసుకునే ప్రక్రియలో భాగంగా సోమవారం రాత్రి.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఓ అధికారి సహా.. మొత్తం ముగ్గురు భారత భద్రతా సిబ్బంది అమరులైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టంభనకు తెరదించే దిశగా రెండు దేశాల ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.