కొవిడ్ మహమ్మారి సంక్షోభం కారణంగా భారత్‌లో అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడినవారు వలస కార్మికులే. నిరంతరాయంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సంఖ్య ఎంతనేదీ నిర్దిష్టంగా తెలియకపోయినా- తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వారు సాగిస్తున్న పోరాటం అత్యంత బాధాకరంగా సాగుతోంది. వలస కూలీలు భారీ సంఖ్యలో పట్టణ ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు పయనమైన వైనం- భారత్‌లో దశాబ్దాలుగా వారిపట్ల చూపుతున్న సామాజిక రాజకీయ దుర్విచక్షణనూ బహిర్గతం చేసింది. వలస కూలీల పట్ల సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన సంఘీభావం, వారు సొంత ప్రాంతాలకు చేరేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వంటివి ఎన్నో దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజల కళ్లకు కట్టాయి.
వారితో ఎలాంటి సంబంధం ఉండదు!
వలస కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాము పనిచేసే చోట పరాయివ్యక్తులుగా పరిగణనకు గురికావడం. వీరి విషయంలో సంఘటిత రంగంలో మాదిరి యజమాని, కార్మికుల మధ్య సంబంధం ఉండదు. సరళీకృత ఆర్థిక వ్యవస్థలో వలస కార్మికులకు తమ మూలధన యజమానితో నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు. యజమాని నుంచి కార్మికులను దూరంగా ఉంచడంలో కార్మిక గుత్తేదారు కీలక పాత్ర పోషిస్తాడు. కార్మికులు గుత్తేదారుపైనే ఆధారపడటం వల్ల వారి పరిస్థితి ఆర్థికంగా దుర్భరంగా మారుతుంది. గుత్తేదారు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జీవించాల్సి వస్తుంది. వారికి తమ హక్కులు, తమకు దక్కాల్సిన సౌకర్యాలపై సరైన అవగాహనా ఉండదు. వారు పనిచేసే పరిశ్రమలూ చాలావరకు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కానివే. అయినా, వారు పరిశ్రమ, కార్మిక గుత్తేదారు ప్రయోజనాల కోసమే పని చేస్తారు.
రాజకీయ పలుకుబడి లేక..
భారత వృద్ధి, వేగవంతమైన పట్టణాభివృద్ధి ప్రక్రియలో ఇదంతా సర్వసాధారణ విషయంలా మారింది. లాక్‌డౌన్‌లో సైతం పరిశ్రమలు, కార్మిక గుత్తేదార్లు కార్మికులను ఆర్థిక కష్టనష్టాలకు వదిలేసి చేతులు దులుపుకొన్నారు. వలస కార్మికులకు రాజకీయ పలుకుబడి లేకపోవడం, వారి తరఫున ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వంటి అంశాల కారణంగా అసమానతలకు లోనవుతున్నారు. స్వస్థలాలను వదిలి సుదూర ప్రాంతాలకు వలసవెళ్లడం వారికి రాజకీయంగా ప్రతికూలంగా మారుతోంది. తమ ప్రయోజనాల కోసం బేరసారాలాడే రాజకీయపరమైన శక్తి వారికి లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. ముఖ్యంగా, పనుల కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి లేదా ఒక నగరంలోనే పలుచోట్లకు వలస సాగించే కార్మికులను రాజకీయ పార్టీలు తమకు ప్రయోజనకరమైన ఓటర్లుగా పరిగణించడం చాలా అరుదు.