తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు రాష్ట్రాలు దాటి ఉజ్జయిన్​కు దూబే.. ఎలా? - akhilesh

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జులై 3న ఎన్​కౌంటర్​ జరిగిన తర్వాత 2 రోజులు కాన్పుర్​లోనే ఉన్నాడని.. తర్వాత సరిహద్దు ప్రాంతాల మీదుగా హరియాణా... అనంతరం మధ్యప్రదేశ్​ వెళ్లాడని తెలుస్తోంది. పోలీసులను అప్రమత్తం చేసి.. భద్రత కట్టుదిట్టం చేసినా ఎలా రాష్ట్రం దాటాడని యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Dubey remained in Kanpur for two days after killing policemen
రెండు రాష్ట్రాలను దాటి ఉజ్జయిన్​కు దూబే.. ఎలా?

By

Published : Jul 9, 2020, 4:52 PM IST

కరుడుగట్టిన నేరస్థుడు, కాన్పుర్ ఎన్​కౌంటర్​ ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్​ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో మహాకాల్​ ఆలయం వద్ద అతన్ని అరెస్టు చేశారు. తొలుత భద్రతా సిబ్బంది ఒకరు చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దూబేను ఈడ్చుకెళ్తున్న సమయంలో.. 'నేను వికాస్​ దూబే.. కాన్పుర్​ వాసిని' అని గట్టిగా అరిచాడు. దూబేతో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేశారు పోలీసులు.

వికాస్​ను అరెస్టు చేసి లాక్కెళ్తున్న పోలీసులు

దూబే అరెస్టును మధ్యప్రదేశ్​ హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా ధ్రువీకరించారు. అనంతరం ఈ సమాచారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు చేరవేశారు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​. ప్రస్తుతం దూబేను మధ్యప్రదేశ్​ పోలీసులు విచారిస్తున్నారు. అనంతరం.. ట్రాన్సిట్​ రిమాండ్​పై యూపీకి తరలించనున్నారు.

8 మంది పోలీసులను చంపి...

జులై 3న జరిగిన కాన్పుర్​ ఎన్​కౌంటర్​ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రౌడీషీటర్​ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో... అతడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్​ దూబే.

ఇదీ చూడండి:రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

బిక్రూ గ్రామానికి చెందిన వికాస్​పై 60కిపైగా క్రిమినల్​ కేసులున్నాయి. ఎన్నో దొంగతనాలు, అపహరణలు, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు అతడు. 2001లో భాజపా నేత సంతోష్​ శుక్లా హత్య కేసులోనూ ఇతని ప్రమేయమున్నట్లు ఆరోపణలున్నాయి. కాన్పుర్​ ఎన్​కౌంటర్​ అనంతరం దూబే తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది యోగి ప్రభుత్వం.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీగా పోలీసు బృందాలను ఏర్పాటుచేసి.. గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

ఇదీ చూడండి:దూబే డెన్​పై​ దాడి సమాచారం పోలీసుల నుంచే లీక్

కాన్పుర్​ ఘటన జరిగిన దగ్గరనుంచి ఇప్పటివరకు దూబే బృందంలోని ఐదుగురు దుండగులు పోలీసుల చేతిలో హతమయ్యారు. మరికొందరిని అరెస్టు చేశారు. వికాస్​కు ముందే సమాచారం అందించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్​ చేశారు.

దూబే అనుచరుల్లో కీలకంగా ఉన్న అమర్​ దూబేను ఉత్తర్​ప్రదేశ్​లోని హమిర్​పుర్​లో బుధవారం ఎన్​కౌంటర్​ చేశారు. ప్రేమ్​ ప్రకాశ్​ పాండే, అతుల్​ దూబేలను కాన్పుర్​ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే హతమార్చారు. దూబే అరెస్టుకు ముందు.. మరో ఇద్దరు అనుచరులు బహువా దూబే, ప్రభాత్​ మిశ్రానూ ఎన్​కౌంటర్​ చేశారు.

కాన్పుర్​లోనే 2 రోజులు..

అయితే.. జులై 3న అర్ధరాత్రి కాన్పుర్​ ఘటన జరిగిన తర్వాత 2 రోజులు అక్కడే శివ్లీ అనే ఊర్లో తలదాచుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దూబే అనుచరుల్లో అరెస్టైన ఓ వ్యక్తి.. ఈ విషయాలు వెల్లడించాడు.

వివరాల ప్రకారం.. ఘటన జరిగిన తర్వాత తన ఇద్దరు అనుచరులతో సైకిళ్లపై శివ్లీకి చేరుకొని.. అక్కడే తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు వికాస్. 2 రోజులకు.. ఇద్దరూ బైక్​పై లఖ్​నవూ వెళ్లగా, దూబే మరో వ్యక్తి అమర్​తో కలిసి ట్రక్కులో హరియాణాలోని ఫరీదాబాద్​ వెళ్లాడు.

అనంతరం.. అంబాహ్​, మురేనా మీదుగా మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​కు చేరుకున్నాడని తెలుస్తోంది. ఇది పోలీసుల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతోంది. పటిష్ఠ భద్రత ఉన్నప్పటికీ.. నిందితుడు 2 రాష్ట్రాలు ఎలా దాటాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్​...

ప్రియాంక గాంధీ ట్వీట్​

కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ.. యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది పూర్తి పోలీసుల వైఫల్యమని ఆరోపించారు. వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేశారు. ఈ వ్యవహారం వెనుక చాలా విషయాలు దాగున్నాయని.. సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:'గ్యాంగ్​స్టర్​ వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి'

వికాస్​ను అరెస్టు చేశారా.. లేక తనంతట తానే లొంగిపోయాడో స్పష్టతనివ్వాలని.. సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ డిమాండ్​ చేశారు. కాల్​ డేటా పరిశీలించాలని, అప్పుడే పూర్తి విషయాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు.

వికాస్​ భాజపానా.. ఎస్పీనా?

ఆ దేవుడే కాపాడాడు: దూబే తల్లి

ఉజ్జయిన్​ మహాకాల్​ ఆలయాన్ని.. వికాస్​ దూబే ఏటా సందర్శిస్తాడని అతని తల్లి సరళా దేవి తెలిపారు. లఖ్​నవూలో ఉంటున్న ఆమె.. నిందితుడు అరెస్టయిన అనంతరం స్పందించారు. తన కుమారుడికి శిక్ష నుంచి మినహాయింపు ఏమీ ఉండకపోవచ్చని, ప్రభుత్వం తమకు సముచితమైందే చేస్తుందని వ్యాఖ్యానించారు.

వికాస్​ దూబే తల్లి

ఇదీ చూడండి:దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత

'' వికాస్​.. ఏటా ఉజ్జయిన్​ వెళ్తాడు. మహాకాళేశ్వర్​ అలయంలో పూజలు చేస్తాడు. దేవుడే అతన్ని కాపాడాడు.

ఇప్పుడు.. ప్రభుత్వం తమకు తోచింది చేస్తుంది. వికాస్​ ప్రస్తుతం భాజపాలో లేడు. సమాజ్​వాదీలో ఉన్నాడు.''

- సరళా దేవి, వికాస్​ దూబే తల్లి

ఈమె వ్యాఖ్యలపై స్పందించిన ఓ సమాజ్​వాదీ పార్టీ ప్రతినిధి.. వికాస్​ తమ పార్టీలో లేడని స్పష్టం చేశారు. అతనికి కఠిన శిక్ష విధించాలని కోరారు.

ఇవీ చూడండి:

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

'కాన్పుర్​ ఎన్​కౌంటర్'​ ఘటనలో మరో ముగ్గురి అరెస్ట్​

'దూబే'కు సమాచారం లీక్​ చేసిన పోలీసుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details