మరికొద్ది రోజుల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో టీకా పంపిణీకి అధికారుల సన్నద్ధతను పరిశీలించేందుకు వ్యాక్సిన్ డ్రై రన్‌ను నిర్వహిస్తోంది కేంద్రం. గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ జరగనుంది.
పంజాబ్ లుథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్‌లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్, గాంధీనగర్ జిల్లాల్లో ఈ మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. సోమవారం డ్రై రన్లో పాల్గొనేవారి వివరాలు నమోదు చేసి కో-విన్ యాప్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ మాత్రమే జరుగుతుందని, మంగళవారం 125 మంది లబ్ధిదారులు డ్రై రన్లో పాల్గొంటారని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డా.కల్పేష్ గోస్వామి తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కూడా మంగళవారమే ఉంటుందని పేర్కొన్నారు.