డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మోటారు వాహనాలకు కావాల్సిన అనుమతి పత్రాల చెల్లుబాటును సైతం ఈ ఏడాది చివరివరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును ఈ మేరకు పెంచింది.
"మోటారు వాహనాల చట్టం 1988, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 ప్రకారం వాహనాల పర్మిట్, ఫిట్నెస్, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల చెల్లుబాటు గడువును 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నాం."
-మంత్రిత్వ శాఖ ప్రకటన
ఫిబ్రవరి 1 నుంచి వ్యాలిడిటీ ముగిసిన పత్రాలు సైతం డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ 31 లోపు చెల్లుబాటు ముగిసే పత్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. లాక్డౌన్ కారణంగా వాహనదారుల పత్రాలకు వ్యాలిడిటీ పునరుద్ధరణ సాధ్యం కాని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి పత్రాలు చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అధికారులకు సూచించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి-ఆత్మహత్య కేసుల్లో సీబీఐ ట్రాక్రికార్డు తెలుసా?