ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి ఆఫీసులకు రావడం ఇప్పుడు సర్వ సాధారణం. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇకపై ఆ ఛాన్స్ లేదు. ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు ఈ నెల 8న డ్రెస్ కోడ్ నిబంధనలను తెలుపుతూ ఓ సర్కులర్ జారీ చేసింది ప్రభుత్వం.
డ్రెస్‌కోడ్ ఇలా..
- మహిళా ఉద్యోగులు చీరలు, చుడీదార్లు, కుర్తాలు, ట్రౌజర్ ప్యాంట్లు ధరించాలి. షర్ట్లు ధరించేందుకు వీలుంది అయితే వాటిపై అవసరమైతే దుపట్టాలు వేసుకోవాలి.
- పురుష ఉద్యోగులకు మాత్రం తక్కువ అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. వారు ట్రౌజర్ ప్యాంట్లు, షర్ట్లు మాత్రమే వేసుకోవాలి.
- ముదురు రంగు దుస్తులు, ఎక్కువగా డిజైన్ ప్యాట్రన్లు, బొమ్మలు ఉన్న దుస్తులు ధరించకూడదు. జీన్స్, టీ షర్ట్లు వేసుకునేందుకు అనుమతి లేదు.
- మహిళలు చప్పల్, సాండల్స్, షూ వేసుకోవచ్చు. పురుషులు షూ లేదా సాండల్స్ మాత్రమే వేసుకోవాలి. స్లిప్పర్లు ధరించేందుకు అవకాశమే లేదు.
- చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు.. శుక్రవారం ఒక్క రోజైనా ఖాదీ దుస్తులు ధరించాలి.