బస్సులు, ఇతర భారీ వాహనాల్లో సంభవించే అగ్నిప్రమాదాలను 30 సెకన్లలోనే పూర్తిగా నియంత్రించే ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్థి సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ జి. సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు బదిలీ చేస్తున్నామని, దీని వల్ల రాబోయే రోజుల్లో అన్నీ వాహనాల్లోనూ ఈ కొత్త వ్యవస్థను నెలకొల్పడానికి వీలవుతుందన్నారు. ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలతో దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇనుమడింపచేసిన డీఆర్డీవో కొత్తగా చేసిన ఆవిష్కరణల గురించి ఆయన ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. ఈ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
బస్సుల్లో అగ్నిప్రమాదాల నివారణకు డీఆర్డీవో పరిష్కారం చూపగలదా? అని కేంద్ర రవాణాశాఖ కార్యదర్శి గిరిధర్ మమ్మల్ని అడిగారు. జలాంతర్గాములు, నౌకలు, యుద్ధట్యాంకుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ప్రయోగాలు చేసిన మా 'సీఫెస్' (సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్స్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ) సంస్థకు ఆ బాధ్యతను అప్పగించాం. విస్తృత పరిశోధనల అనంతరం.. బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన సాధనాలను అభివృద్ధి చేశాం. రాబోయే రోజుల్లో దీన్ని కార్యాచరణలో పెట్టి అన్ని బస్సుల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.
డీఆర్డీవో రూపొందించిన పరికరం బస్సుల్లో అగ్నిప్రమాద ముప్పును పసిగట్టి, ఆ వెంటనే దాన్ని ఆర్పివేయడానికి చిన్నపాటి నీటితుంపర్లును విడుదల చేస్తుంది. 10 నుంచి 30 సెకన్లలోపే మంటలు పూర్తిగా ఆర్పేంత శక్తిమంతంగా అవి ఉంటాయి. ఇంజన్ కంపార్ట్మెంట్ కోసం ఏరోసోల్ యంత్రాన్ని రూపొందించాం. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే వాయువులు విడుదల చేసి, 5 సెకన్లలోనే ఇంజిన్ విభాగంలో మంటలను ఆర్పేస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు బదిలీ చేశాం.
ఎగుమతుల పెంపుపై దృష్టి..