తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయుధ ఉత్పాదనలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్‌! - రక్షణ ఉత్పత్తుల ముసాయిదా

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రక్షణ రంగాన్ని తీర్చిదిద్దుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో రక్షణ సామగ్రి ఉత్పత్తి రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్​ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఆయుధాలను ఎగుమతి చేయాలని నిర్దేశించుకుంది.

Draft Defence Production & Export Promotion Policy issued
ఆయుధ ఉత్పాదనలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్‌!

By

Published : Aug 4, 2020, 6:45 AM IST

వచ్చే ఐదేళ్లలో రక్షణ సామగ్రి ఉత్పత్తిలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుధ ఎగుమతులనూ చేయాలని నిర్దేశించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే సామర్థ్యం ఈ రంగానికి ఉందని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్లు రక్షణ శాఖ రూపొందించిన ముసాయిదా విధాన పత్రం పేర్కొంది.

ఎగుమతులకు ఊతమిచ్చే పత్రం

రక్షణ ఉత్పత్తి, ఎగుమతి ప్రోత్సాహక విధానం- 2020 పేరిట రూపొందిన ఈ పత్రంలో ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 2025 నాటికి రూ.35 వేల కోట్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆయుధ ఉత్పత్తి, ఎగుమతికి ఊతమిచ్చే అంశంపై రక్షణ శాఖకు ఇది ఒక మార్గదర్శక పత్రమని అధికారులు తెలిపారు.

దేశ సైనిక దళాల అవసరాలను తీర్చేలా ఏరోస్పేస్‌, యుద్ధనౌకల నిర్మాణం సామర్థ్యాన్ని సాధించేలా పటిష్ట, పోటీతత్వంతో కూడిన రక్షణ పరిశ్రమను సాకారం చేయడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ డిజైన్‌, అభివృద్ధి ద్వారా 'భారత్‌లో తయారీ'ని ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించినట్లు వివరించారు. 2024 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రక్షణ ఉత్పాదక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు కూడా చేసినట్లు వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో ఆయుధ కొనుగోళ్ల కోసం 13 వేల కోట్ల డాలర్లను భారత్‌ వెచ్చించవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో మన దేశం.. అంతర్జాతీయ ఆయుధ దిగ్గజాలకు ఆకర్షణీయ మార్కెట్‌గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details