భారత్‌తో ఢీ అంటే ఢీ అన్న చైనా ఒక్కసారిగా వెనక్కుతగ్గింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో తమ బలగాలను 2 కి.మీ వరకు ఉపహంసరించుకుంది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా వెనకడుగు వేయని చైనాపై భారత్ ఏ విధంగా ఒత్తిడి పెంచింది అంటే సమాధానం ఒక్కటే.. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటలపాటు డోభాల్ ఆదివారం ఫోన్లో సంభాషించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగినట్లు వెల్లడించాయి. ఈ మేరకు ఇరుదేశాలు వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) గౌరవిస్తూ, గమనిస్తుండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలానే వాస్తవ పరిస్థితులను మార్చేందుకు ఏ దేశం ఏకపక్ష చర్యలకు ఉపక్రమించకూడదని అంగీకారం జరిగినట్లు సమాచారం.
డోభాల్ ఒత్తిడితోనే..!
ఎల్‌ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను వీలైనంత త్వరగా అక్కడ నుంచి ఉపసంహరించుకునేందుకు డోభాల్ ఒత్తిడితో చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసి పనిచేసేందుకు నిర్ణయం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
"ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించారు. శాంతి పునరుద్ధరణ కోసం ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను పూర్తిస్థాయిలో సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు."
- విదేశాంగ శాఖ ప్రకటన