అయోధ్య అంశంపై.. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడ్డారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని నిర్ణయించడమే ఇందుకు కారణమన్నారు. ఇక అయోధ్య అంశాన్ని పక్కనపెట్టి హిందూ, ముస్లింలందరూ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంగా నలిగిన అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు రవిశంకర్.
"సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతృప్తిగా ఉన్నా. రెండు వర్గాలు కలిసి ఓ వైపు మందిరం మరోవైపు మసీదు నిర్మించాలని నేను 2003 నుంచి చెబుతున్నా. వివాదాస్పద స్థలంలోనే మసీదు నిర్మిస్తామని కొందరు పట్టుబట్టడం అర్థం లేని విషయం. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. సహజంగానే తీర్పు ద్వారా ప్రతీ ఒక్కరినీ సంతోషపెట్టలేము. ఇప్పుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పినవారే ధర్మాసనం నిర్ణయాన్ని గౌరవిస్తామని గతంలో అన్నారు. వారు మాట మార్చారు. ఒకప్పుడు.. తీర్పు వారికి అనుకూలంగా లేకపోయినా గౌరవిస్తామన్నారు. ఇది కచ్చితంగా ద్వంద్వ వైఖరిగా ఉంది. సమాజంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగంపై దృష్టిసారించాల్సిన సమయం ఇది. పారిశ్రామికవేత్తలను తయారుచేసి ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించాలి."-శ్రీశ్రీ రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు.