భారత సైన్యంలో సేవలందించేందుకు రెండు మూపురాల ఒంటెలు సిద్ధమవుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి దళాలు గస్తీ నిర్వహించడానికి వీటిని త్వరలో భారత సైన్యంలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.
లద్దాఖ్‌లోని లేహ్‌లో 17 వేల అడుగుల ఎత్తులో 170 కిలోల భారాన్ని మోయగల రెండు మూపురాల ఒంటెలపై రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)పరిశోధనలు చేసింది. ఒకే మూపురం ఉన్న ఒంటెలకన్నా ఇవి ఎక్కువ కాలం నీరు, ఆహారం లేకుండా ఉండగలవని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
"ఈ ఒంటెల ఓపిక, సామర్థ్యంపై పరిశోధనలు జరిపాం. ఇవి స్థానిక జంతువులు. చైనా సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో 170 కిలోల భారాన్ని మోయగలవని గుర్తించాం. ఈ భారంతో అవి 12 కిలోమీటర్ల వరకు పెట్రోలింగ్ చేయవచ్చు. అయితే, ఈ ఒంటెల జనాభా తక్కువ ఉన్నందున వాటి సంఖ్యలను పెంచిన తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకుంటారు."