దూరదర్శన్.. భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్. ప్రభుత్వం నియమించిన ప్రసార భారతి బోర్డు ఆధ్వర్యంలో 6 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. నేడు దూరదర్శన్ 60వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఈ ఛానెల్‌తో తమకున్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు అభిమానులు. దేశంలో వినోదం మహాభారతం, ఫౌజీ, మాల్గుడి ధారావాహికల చుట్టూ తిరిగిన రోజులను నెమరువేసుకున్నారు.
ట్విట్టర్ వేదికగా దూరదర్శన్పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు ప్రజలు. వారిలో చాలా మంది ' మీ ఇష్టమైన డీడీ షో ఏది' అంటూ పోస్ట్ చేశారు. కార్యక్రమానికి ముందు మ్యూజిక్‌తో పాటు వచ్చే దూరదర్శన్ లోగోను పోస్ట్ చేస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
దూరదర్శన్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారభారతి సీఈవో శశి శేఖర్ వేంపతి సంతోషం వ్యక్తం చేశారు.
" దూరదర్శన్ పాతబడిపోయిందన్న వాదనలను తోసిపుచ్చేందుకు ఇదే సరైన సమయం. డిజిటల్ ప్రేక్షకుల కోసం సరికొత్తగా మారుతోంది. దూరదర్శన్ ఒక్కటే 60వ వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకోలేదు, భారతీయ టెలివిజన్ ప్రసారాలూ 6 దశాబ్దాలు పూర్తి చేసుకున్న చరిత్ర ఇది. భారత్‌లో టీవీ పరిశ్రమకు ఇదొక మైలురాయి."