జైలు నుంచి తాను ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు లేఖ రాశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
జైలు అధికారులకు శశికళ లేఖ అయితే, జైలు నుంచి ఆమె విడుదలకు సంబంధించి ఊహాగానాలు వస్తున్న వేళ అధికారులకు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం కింద కూడా తన జైలు శిక్ష, విడుదల తదితర అంశాలను వెల్లడించొద్దని కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. తన వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని శశికళ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ప్రచారం కోసమో, రాజకీయ దుష్ప్రచారం కోసమో ఇలాంటి దరఖాస్తులు చేస్తారని తెలిపారు.
జనవరి 27న విడుదల?
బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించారు జైలు అధికారులు. న్యాయస్థానం విధించిన రూ.10 కోట్ల జరిమానా కడితే జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని.. లేకపోతే మాత్రం 2022 ఫిబ్రవరి 27 వరకు జైలులోనే ఉండక తప్పదని తెలిపారు.
ఇదీ చూడండి:జనవరిలో చిన్నమ్మ రిలీజ్- అన్నాడీఎంకేలో గుబులు!
ఈ నేపథ్యంలో తాజాగా శశికళ తరఫున ఆమె న్యాయవాది జైలు చీఫ్ సూపరింటిండెంట్‌కు లేఖ రాశారు. మరోవైపు, సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని జైలు అధికారులు శశికళను ముందే విడుదల చేసే అవకాశం ఉందంటూ ఆమె న్యాయవాది తెలిపారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ విడుదలతో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది.
2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించింది సుప్రీం కోర్టు.
ఇదీ చూడండి:శశికళను పార్టీకి దూరం చేసేందుకు అన్నాడీఎంకే స్కెచ్!