కొవిడ్-19 విపత్తు కారణంగా విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలనూ వాయిదా వేశారు. ఉద్యోగులేమో కొందరు ఇంటి నుంచే పనిచేస్తుండగా మరికొందరికి సంస్థలే సెలవులు ప్రకటించాయి. అనుకోకుండా వచ్చిన ఈ విరామ సమయంలో విద్యార్థులూ ఉద్యోగార్థులూ పుస్తకాలనూ, అభ్యాసాన్నీ పూర్తిగా పక్కనపెట్టేస్తే నష్టమే. ఎందుకంటే దేన్నైనా అలవాటు చేసుకోవడానికైనా, మరచిపోవడానికైనా 21 రోజుల సమయం సరిపోతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని కెరియర్ ఆలోచనలకూ, భవిష్యత్ ప్రణాళికలకూ వినియోగించుకోవాలి. ఆసక్తీ, అభిరుచులకు సంబంధించిన, కెరియర్‌కు పనికొచ్చే నైపుణ్యాలను నేర్పే ఆన్‌లైన్ కోర్సుల్లో చేరొచ్ఛు
విదేశీ విద్యాభ్యాసానికి అవసరమైన ప్రీ రిక్విజిట్ టెస్టులు.. టోఫెల్, జీఆర్‌ఈ. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అభ్యర్థులు ఇంటినుంచే ఆన్‌లైన్లో ఈ పరీక్షలు రాయటానికి ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) ఏర్పాట్లు చేస్తోంది. కృత్రిమమేధ, లైవ్ మానిటరింగ్ సాంకేతికతలను ఇందుకు ఉపయోగించుకోబోతోంది.
ఆగకుండా.. ఆపకుండా..
మిగతావారితో పోలిస్తే.. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి కొంతనయం. వారి వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. పదో తరగతి సహా ఉన్నతవిద్య చదివేవారు తమ సన్నద్ధతను కొనసాగించాల్సిందే. ఇందుకు గతంలో తాము చేసుకున్న పునశ్చరణ ప్రణాళికనే కొనసాగించడం మేలు.
'ఎలాగూ సిలబస్ పూర్తిచేశాం. పరీక్ష తేదీలు ప్రకటించాక మళ్లీ చూసుకోవచ్చులే.' అనే ధోరణి సరైంది కాదు. అప్పటికే చదివినవే అయినా పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని కొంత సందేహం ఉన్నవాటిని మళ్లీ నేర్చుకోవడం. అప్పటికే బాగా వచ్చినవాటిని అప్పుడప్పుడూ మననం చేసుకోవటం, లేదంటే చూడకుండా రాయడం వంటివి సాధన చేయొచ్చు.
- టాపిక్‌లవారీగా ఎన్నో వెబ్‌సైట్‌లు వీడియో పాఠాలను అందుబాటులో ఉంచాయి. స్కాలస్టిక్ ఇండియా, ఎడ్యుబుల్, టాపర్, దటాప్‌టెన్స్, లర్న్ నెక్స్‌ట్ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.
సెమిస్టర్ మధ్యలో ఆగి లేదా సిలబస్ పూర్తవనివారికీ ఆన్‌లైన్ అధ్యయన అవకాశముంది. యూజీసీ ఆదేశాల మేరకు.. ప్రముఖ కళాశాలలు తమ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ ద్వారా చదువుకోవాలనుకునేవారికి అందుబాటులోనున్న వెబ్‌సైట్ల వివరాలను ఉంచుతున్నాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు.
మూడు నెలలపాటు ఉచితంగా సీఎస్‌ఈ, ఐటీ, మెకానికల్, సివిల్, ఈఈఈ, ఈసీఈ బ్రాంచిలకు సంబంధించిన ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పాఠాలనూ, ప్రయోగాలనూ మణిపాల్ గ్రూప్ కోఎమ్ట్ ఎడ్యుటెక్ అందిస్తోంది. www.edulib.in
ప్రవేశ పరీక్షలకు తయారీ..
అస్తమానూ కోర్సు సిలబస్‌నే చదవడం అనాసక్తిగా అనిపిస్తే.. భవిష్యత్తులో రాయాలనుకునే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవొచ్ఛు చివరి సంవత్సరంలో ఉన్నవారు వీటిపై దృష్టి పెట్టడం మాత్రం తప్పనిసరి. పాలీసెట్, నీట్, జేఈఈ సహా అన్ని ప్రవేశపరీక్షలూ వాయిదా పడ్డాయి. వీటిని రాయబోయేవారూ ఈ విరామాన్ని పూర్తిగా కాలక్షేపానికో, విశ్రాంతి తీసుకోడానికో పరిమితం కాకూడదు. స్వల్ప విరామాలు తీసుకోవచ్చు గానీ సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
- జేఈఈకి సన్నద్ధమవుతున్నవారికి ఐఐటీ ఖరగ్‌పూర్ కొన్ని పాఠాలను సిద్ధం చేసింది. కొన్ని మాడ్యూళ్లతోపాటు నోట్స్‌నూ అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఎల్‌ఐ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వీటిని పొందొచ్చు.
ఇంకా ఎన్నో విద్యాధారిత వెబ్‌సైట్లు విద్యార్థుల కోసం మాక్ టెస్టులను అందుబాటులో ఉంచాయి.
- యూఎన్ అకాడమీ యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ వారికి ఛాంపియన్‌షిప్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.
- ఖాన్ అకాడమీ మేథ్స్, సైన్స్, ప్రోగ్రామింగ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఆసక్తి ఉండాలేగానీ విద్యార్థులకు అందుబాటులో ఎన్నో అవకాశాలున్నాయి.
- యుడెమి, కోడ్ అకాడమీ, లర్న్‌టూకోడ్, కోడ్ అవెంజర్స్, ఖాన్ అకాడమీ మొదలైనవి ప్రోగ్రామింగ్, కోడింగ్‌ల్లో బేసిక్ కోర్సులను ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నాయి.
ఉద్యోగుల సంగతి.?
లాక్‌డౌన్ విద్యార్థులపైనే కాదు.. ఉద్యోగులపైనా ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. చాలావరకూ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించినా.. ఇంకెన్నో సంస్థలు పూర్తిగా సెలవులను ప్రకటించేశాయి. దీన్ని విశ్రాంతి తీసుకునే సెలవులుగానే భావిస్తే వీరూ నష్టపోవచ్చు. ఈ వ్యవధి తర్వాత ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు.
కాబట్టి, పనికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, బృందంతో తరచూ మాట్లాడుతుండటం వంటివి చేస్తుండాలి. తమ పరిశ్రమకు సంబంధించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న శిక్షణ ప్రోగ్రాములనూ చేయొచ్ఛు వీటిలో నైపుణ్యాలతోపాటు మార్కెటింగ్, ఇంకా అన్ని విభాగాల కోర్సులూ అందుబాటులో ఉంటున్నాయి.
ప్రోగ్రామింగ్, కోడింగ్
స్టెమ్‌రోబో టెక్నాలజీస్ /www.stemrobo.com
ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల వరకు స్టెమ్ ఎడ్యుకేషన్‌పై ఈ సంస్థ పని చేస్తోంది. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్‌లైన్‌లో వర్చువల్ క్లౌడ్ బేస్‌డ్ లర్నింగ్ మేనేజ్‌మెంట్ మోడల్‌ను టింక్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా గేమ్ డిజైనింగ్, పైథాన్, జీయూఐ, రోబోటిక్స్, డీఐవై కోడింగ్ వంటివి నేర్చుకోవచ్చు.
కోడింగ్ నింజాస్ /www.codingninjas.com
21 రోజుల కోడింగ్ చాలెంజ్‌ను ఈ సంస్థ ప్రవేశపెట్టింది. ఇది పెయిడ్ కోర్సు. రెండు నెలల కాలవ్యవధి. జావా, సీ++, పైథాన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, మెషిన్ లర్నింగ్‌లను అందిస్తోంది. 21 రోజుల్లో పూర్తిచేసినవారికి 50% నగదు రిఫండ్ చేయనున్నారు.