బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్.. తృణమూల్ కాంగ్రెస్ మంత్రులను సుతిమెత్తగా హెచ్చరించారు. అధినేత్రి మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు తన వ్యాఖ్యలపై అతిగా స్పందించవద్దని సూచించారు. మంత్రులు తమ విభాగాల పనులు చూసుకోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తన వ్యాఖ్యలపై స్పందించాలని, లేదా నిర్దిష్ట మంత్రిని ఇందుకోసం నియమించాలని గవర్నర్ జగ్దీప్ స్పష్టం చేశారు.
"నా వ్యాఖ్యలపై జూనియర్ ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పందించారు. ఆమె తన మంత్రిత్వశాఖపై దృష్టిని కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్య మంత్రిత్వశాఖ నిజంగా ఎలా ఉందో మనకు తెలుసుకదా!"- జగ్దీప్ ధన్ఖర్, బంగాల్ గవర్నర్
ప్రభుత్వ స్పందన లేదు..
గవర్నర్బుధవారంముర్షిదాబాద్ జిల్లాలోని డోక్మల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం తనకు ఓ హెలికాప్టర్‌ను సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు గవర్నర్. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలు ధరించి గవర్నర్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.
"నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నా చర్యలను నియంత్రించాలనుకుంటోంది. కానీ రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుల మేరకు నేను నడుచుకుంటానని స్పష్టం చేస్తున్నాను. ఇతరులు నన్ను నియంత్రించలేరు."- జగ్దీప్ ధన్ఖర్