తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శిక్ష అనుభవిస్తున్న వారి విడుదలపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకుతమిళనాడులో పర్యటించిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులపై తనకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ " మా తండ్రి హత్య నాకు, మా కుటుంబానికి వ్యక్తిగతమైన విషయం. మరొకటి చట్టపరంగా నిర్ణయించాల్సిన సమస్య. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమే. కోర్టు వారిని విడుదల చేయాలని మేమూ అనుకుంటున్నాం. ఎవరిపై మాకు శత్రుత్వం, ద్వేషం లేదు. కోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
అధిక స్థానాలు గెలుస్తాం
రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వస్తుసేవల పన్ను విధానంలో సంస్కరణలు చేస్తామని హామీ ఇచ్చారు. కనీస ఆదాయ పథకం తీసుకొస్తామని తెలిపారు.
ప్రధానికి భయమెందుకు
రఫేల్ సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహం లేదని రాహుల్ స్పష్టం చేశారు. తాము మాట్లాడేది కేవలం ఒప్పందంలో జరిగిన అవినీతిపైనేనని, దానిపై కచ్చితంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేదు రాహుల్.
మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన రాహుల్... మీడియా ముందుకు రావడానికి ప్రధాని ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు.