కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షలతో యావత్ ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే మందిర నిర్మాణంపై భక్తుల్లో ఉన్న ఆసక్తిని వైరస్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. లాక్డౌన్ సమయంలోనూ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. విరాళాలు అందించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన అకౌంట్లలోకి కరోనా పరిస్థితిని లెక్క చేయకుండా నగదును ట్రాన్స్ఫర్ చేశారు భక్తులు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన రెండు అకౌంట్లలోకి ఇప్పటివరకు రూ. 4.60 కోట్లు జమయ్యాయి.
'నగదు కొరతకు అవకాశమే లేదు'
రామ మందిర నిర్మాణానికి నగదు కొరత ఏర్పడుతుందని అనుకోవడం లేదని తెలిపారు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ప్రజలు పెద్దమొత్తంలో కానుకలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత సుందరమైన మందిరం తయారుకానుందని ధీమా వ్యక్తం చేశారు.