తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసుపత్రిలో బొమ్మలు.. పిల్లల ఏడుపులకు సెలవులు!

పిల్లలకు జబ్బు చేస్తే తల్లిదండ్రులకు కాళ్లూ చేతులు ఆడవు.. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ అల్లరి చేసే పిల్లలు అలా డీలా పడిపోతే అలానే అనిపిస్తుంది కదా మరీ! వారిని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్తారు. కానీ, వైద్యం చేయించుకునేందుకు పిల్లలు ససేమిరా అంటారు. కానీ కేరళలోని ఈ ఆసుపత్రి మాత్రం ప్రత్యేకం.

By

Published : Sep 3, 2019, 7:02 AM IST

Updated : Sep 29, 2019, 6:13 AM IST

ఆసుపత్రిలో బొమ్మల కొలువు.. పిల్లల ఏడుపులకు ఇక సెలవు!

ఆసుపత్రిలో బొమ్మలు.. పిల్లల ఏడుపులకు సెలవులు!

ఆసుపత్రి చూడగానే పిల్లలు అదేదో రాక్షస కుటీరంలా భావించి ఏడుపు మొదలు పెడతారు. ఇక వైద్యులనైతే బూచీని చూసినట్టు చూసీ 'అమ్మా ఇక్కడి నుంచి వెళ్లిపోదాం' అంటారు. ఇక వారికి సర్ది చెప్పి వైద్యం చేయించేసరికి అక్కడ​ సిబ్బందీ, తల్లిదండ్రులు ఓ చిన్నపాటి యుద్ధమే చేయాలి.

అందుకే ఆసుపత్రి వాతావరణాన్ని వారికిష్టమైన బొమ్మలతో నింపేసి.. కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థులు.

కేరళ మలప్పురంలోని ఓ ప్రభుత్వ వైద్యశాల అధికారుల అనుమతి తీసుకుని, బాలల వార్డును రంగురంగుల బొమ్మలతో చిత్రీకరిస్తున్నారు జాతీయ సేవా పథకం (ఎన్​ఎస్​ఎస్) విద్యార్థులు.

"ముఖ్యంగా నేను ఇక్కడ కార్టూన్​ చిత్రాల గురించి పని చేస్తున్నాను. ఇది చిన్నారుల వార్డు. పిల్లలకు చూడగానే నచ్చేవి.. ఆకర్షణీయంగా అనిపించేవి కార్టూన్లు. అందుకే కార్టూన్​ చిత్రాలైన డోరా బుజ్జి.. అలానే యాంగ్రీ బేబీస్​ వంటి చిత్రాలను మేము వేస్తున్నాము."

- హెన్నా, ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థిని

స్వచ్ఛందంగా చేతులతోనే అన్ని బొమ్మలు గీసే వారి శ్రమకు... పిల్లల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బొమ్మలు చూస్తూ చక్కగా వైద్యానికి సహకరిస్తున్నారంటున్నారు వైద్యులు.

"ఇంతకుముందు ఈ ఆసుపత్రిలో వైద్యులను చూసి పిల్లలు భయపడేవారు. సిరంజి చూస్తే హడలిపోయేవారు. అయితే ఈ ఆసుపత్రి పిల్లలకు వైద్యంతో పాటు స్నేహాన్ని పంచాలనే లక్ష్యంతో నిర్మించారు. మలప్పురం ప్రభుత్వ కళాశాలలోని ఎన్​ఎస్​ఎస్​ యూనిట్​ వాళ్లు రెండు రోజుల క్రితం వచ్చి.. ఇక్కడ కార్టూన్​లు..డోరా చిత్రాలు..పిల్లలకు ఇష్టమైన బొమ్మలు వేస్తున్నారు. ఈ వార్డులో పూర్తిగా అయిపోయాక... ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించిన చిత్రాలను గీయించాలని ఆలోచిస్తున్నాం."

- మొహిద్దీన్​ కుట్టీ, ఆసుపత్రి అధికారి

హాస్పిటల్​లో బొమ్మలతో పాటు బెలూన్లు, ఆట వస్తువులనూ ఏర్పాటు చేశారు. ఇంకేముంది సూదులు పొడిచినా అవన్నీ చూసి రెండు నిమిషాల్లో నవ్వులు చిందిస్తున్నారు అక్కడికొస్తున్న పిల్లలు.

ఇదీ చూడండి:దేశ వ్యాప్తంగా 'జై జై గణేశా' నామస్మరణ

Last Updated : Sep 29, 2019, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details