ఇంట్లో ఉన్న మనుషులను తాకుదామంటేనే వణుకుతున్న రోజుల్లో- తమకేం సంబంధం లేని మనుషులు వేసిన చెత్త తీస్తున్న ఈ కార్మికుల రుణం ఎట్లా తీర్చుకోగలం? కన్నబిడ్డను తనివితీరా ముద్దాడదామంటే ధైర్యం చాలని రోజులివి. ఎవరిని తాకితే వైరస్ సోకుతుందోననే భయంతో రోజూ పదులసార్లు శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకుంటున్న కాలమిది. ఈ పారిశుద్ధ్య కార్మికులు నిస్వార్థంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందుకు పనిచేస్తున్నారు? కరోనా విపత్తులో కొవ్వొత్తిలా తాము కరిగిపోయినా పరవాలేదు కానీ, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే వాళ్ల తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యమనిపించింది.
శార్వరి నామ సంవత్సరాది (ఉగాది) రోజున ఉదయాన్నే ఓ మిత్రుడు ఫోన్ చేశాడు. తన ఊరికి డెబ్బై కిలో మీటర్ల దూరంలో ఉన్న అతడి అమ్మమ్మ చనిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది కాబట్టి, ఆమె పార్థివదేహాన్ని తన స్వగృహానికి చేర్చేందుకు నా సహాయం అర్థించాడు. అంత్యక్రియల అనంతరం ఆ మిత్రుడు విధులకు హాజరయ్యాడు. కార్యక్రమాలు ఎలా జరిగాయంటూ అడిగాను. అంతే... అతను కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వృద్ధురాలు చనిపోయింది గుండె నొప్పితో. కానీ, ఊరివాళ్లంతా ఆమెకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో అంత్యక్రియలకు సైతం హాజరు కాలేదట. నలుగురు బంధువులు పోగయి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారట.
ఇంకా విషాదమేమిటంటే కనీసం పూడ్చిపెట్టే బొంద తవ్వేందుకు మనుషులు లేకపోతే- యంత్ర సహాయంతో బొంద తీసి, అదే యంత్ర సహాయంతో ఆ వృద్ధురాలి భౌతిక కాయాన్ని ఖననం చేశారట. ‘ఎంతోమందిని పెంచి పెద్దచేసిన అమ్మమ్మ దిక్కులేనిదానిలా అనంతలోకాలకు పోయింది సార్’ అంటూ అతడు కన్నీటి పర్యంతమైన తీరు చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఏ మాత్రం తెలియని, సంబంధంలేని వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని తెలిస్తే చాలు- భార్యాపిల్లల్ని, కన్న తల్లిదండ్రులను ఆఖరికి తనను తానే మరిచి చికిత్స అందిస్తున్న వైద్యుడు ఎంత గొప్పవాడు? ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిద్రాహారాలు మాని వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు ఈ సమాజానికి చేస్తున్న కృషిని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు కనిపించే వైద్యులతో పాటు కనిపించని వైద్యులూ ఉన్నారు. వాళ్లే కరోనాకు మందు కనుగొనాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు. ల్యాబోరేటరీల్లో వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. దేశవిదేశాల్లోని అనేకమంది శాస్త్రవేత్తలకు శతకోటి వందనాలు. ఈ కష్టకాలంలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా అనునిత్యం సమాజానికి వెలుగులు పంచుతున్న విద్యుత్‌రంగ సిబ్బంది సేవలూ కొనియాడదగినవే.