తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా సంక్షోభంలో అసలైన హీరోలు వారే: సుప్రీం - సుప్రీంకోర్టు తీర్పు

కరోనా విజృంభిస్తోన్న వేళ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణార్థం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ సంక్షోభ సమయంలో వాళ్లే నిజమైన హీరోలని కొనియాడింది. వారికి అవసరమైన సంఖ్యలో మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

SUPREME COURT
సుప్రీంకోర్టు

By

Published : Apr 8, 2020, 3:30 PM IST

వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కరోనాపై పోరాడుతున్న నిజమైన యోధులుగా అభివర్ణించింది సర్వోన్నత న్యాయస్థానం. అలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్యులు, సిబ్బందికి మాస్కులు, హజ్మత్ సూట్లు సహా పీపీఈ కిట్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది.

సలహాలు స్వీకరిస్తున్నాం..

లాక్​డౌన్ ప్రభావమే కాకుండా వైద్య సిబ్బంది కోసమూ ప్రజల నుంచి సలహాలు ఎందుకు తీసుకోకూడదని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జిల్లా స్థాయిలో నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. సలహాలు స్వీకరించి పరిశీలించాలని సూచించింది.

దీనిపై స్పందించిన కేంద్ర తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా... ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్ రూం ద్వారా సలహాలు స్వీకరిస్తుందని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకు ప్రాధాన్యమిచ్చి తగిన చర్యలు కేంద్రం తీసుకుంటుందని తెలిపారు.

జీతాల కోతపై..

కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి అందించిన మాస్కులు, పీపీఈ కిట్లకు జీతాల్లో కోత విధించారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అవి ఊహాగానాలు మాత్రమేనని.. వైద్యులు, సిబ్బంది జీతాల్లో ఎలాంటి కోతలు విధించవద్దని కేంద్రం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు.

ఒకవేళ ఎక్కడైనా వైద్య సిబ్బంది జీతాల్లో కోత విధించిన ఘటనలు జరిగితే తక్షణమే కేంద్రం చర్యలు తీసుకుంటుందని సొలిసిటరీ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'వైద్యులు ఒక్క మాస్కును 4 సార్లు వినియోగించాలి!'

ABOUT THE AUTHOR

...view details