వైద్యుడ్ని కనిపించే దైవంగా కొలుస్తారు. ముంబయి సమీపంలోని అలీబాగ్ పట్టణానికి చెందిన వైద్యుడు ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండగా.. లాక్డౌన్ సమయంలో బైక్‌పై పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు రక్షించారు.
అలీబాగ్‌కు చెందిన శ్వేత పాటిల్ పురుటి నొప్పులతో దగ్గర్లోని ఓ నర్సింగ్ హోంలో చేరింది. శ్వేత మధుమేహ వ్యాధితో బాధపడుతోంది. ఇదివరకు శ్వేత ఒక బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ శిశువు పుట్టిన వెంటనే చనిపోయినట్లు ఆమె భర్త కేతన్ తెలిపాడు.
పిల్లల వైద్యుడి సాయం..
ఈసారి శ్వేతకు డెలివరీ చేసేందుకు ముందుగానే పిల్లల వైద్యుడైన డాక్టర్ రాజేంద్ర చందోర్కడ్ను సాయం కోరారు నర్సింగ్ హోం గైనకాలజిస్ట్. శ్వేతకు అబ్బాయి పుట్టాడు. 3.1 కిలోల బరువుతో ఆరోగ్యంగానే ఉన్నట్లు రాజేంద్ర గుర్తించారు.
కాసేపటి తర్వాత ఉన్నట్టుండి.. ఆ శిశువు శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. శరీరమంతా నీలంగా మారిపోయింది. డయాగ్నోసిస్ చేసేందుకు పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే లాక్డౌన్ కారణంగా ఎలాంటి వాహనాలు అందుబాటులో లేవు.