వ్యక్తిగత పెట్టుబడులు... ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుచుకుంటారు. ఎవరి అభిప్రాయం వారిది. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అగ్రనేత సోనియా గాంధీల పెట్టుబడులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికర అంశం.
ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణ పత్రాల్లో ఈ నేతలు పెట్టుబడులు, ఇతర ఆస్తుల వివరాలు పొందుపరిచారు. వీటి ఆధారంగా ఈటీవీ భారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం...
నరేంద్రమోదీ..
- ప్రకటించిన ఆస్తుల విలువ : 2.51 కోట్లు
మోదీ ఎల్ అండ్ టీ ఇన్ప్రాస్ట్రక్చర్ ట్యాక్స్ సేవింగ్ బాండ్లో రూ.20 వేలు పెట్టుబడి పెట్టారు. జాతీయ పొదుపు పథకం, పోస్టల్ సేవింగ్స్, బీమాల్లో రూ. 7.62 లక్షలు మదుపు చేశారు.
మోదీ పేరు మీద రూ. 1.14 లక్షలు విలువ చేసే 45 గ్రాముల బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఎస్బీఐ ఖాతాలో రూ. 85,145 టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)గా ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో టీడీఎస్‌ను రూ.1.41 లక్షలుగా తెలిపారు.
మోదీకి 3,531 చదరపు అడుగుల ఇళ్లు ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.10 కోట్లు. ఇందుకు సంబంధించి అద్దె, విద్యుత్, బిల్లు, టెలిఫోన్ లాంటివి ప్రభుత్వానికి బాకీ లేరు.
సోనియా గాంధీ...
- ప్రకటించిన ఆస్తుల విలువ : రూ.11.82 కోట్లు
సోనియా గాంధీ మంచి పెట్టుబడిదారు అని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు, షేర్లలో రూ. 2.45 కోట్లు పెట్టారు. ఇవి హెచ్డీఎఫ్సీ, కొటక్, మోతిలాల్ ఓస్వాల్, రిలయన్స్, హడ్కో, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ తదితర వాటిలో ఉన్నాయి.
వీటితో పాటు రూ. 72.25 లక్షలు జాతీయ పొదుపు పథకం, పోస్టల్ సేవింగ్స్, బీమా తదితరాల్లో పెట్టారు. రూ. 59.97 లక్షల విలువైన అభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.
దిల్లీలో దేరామండి, సుల్తాన్పూర్ గ్రామాల్లో 3.28 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 7.29 కోట్లు. మొత్తం రూ. 16.60 లక్షలు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. రూ.60 వేలు మాత్రమే ద్రవ్య రూపంలో ఉన్నాయి.
రాహుల్ గాంధీ...
⦁ ప్రకటించిన ఆస్తుల విలువ : రూ. 15.88 కోట్లు
తల్లి సోనియా గాంధీలా రాహుల్ కూడా విభిన్న రకాల ఫండ్లలో పెట్టుబడులు పెట్టారు.
2017-08 సంవత్సరానికి దాఖలు చేసిన ఐటీ రిటర్నులలో రూ. 1.12 కోట్ల ఆదాయం ప్రకటించారు. నగదు రూపంలో రూ.40 వేలు ఉండగా... బ్యాంకు ఖాతాల్లో రూ.17.93 లక్షలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ రూ.5.20 కోట్లు మ్యూచువల్ ఫండ్లలో పెట్టారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, డీఎస్పీ స్మాల్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియన్ ఈక్విటీ, ఐడీఎఫ్సీ మల్టీ క్యాప్, ఎల్ అండ్ టీ ఈక్విటీ, మోతిలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంటి ఫండ్లు ఈయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
జాతీయ పొదుపు పథకం, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు తదితరాల్లో రూ.39.89 లక్షలు ఉండగా... బంగారం తదితర విలువైన వస్తువులపై రూ.2.91 లక్షలు పెట్టుబడులు పెట్టారు.
రాహుల్‌కు తన సోదరి ప్రియాంకతో కలిసి రూ.1.33 కోట్లు మార్కెట్ విలువున్న భూమి ఉంది. గురుగ్రామ్‌లో రూ.8.76 కోట్లు విలువైన 5,838 చదరపు అడుగుల కార్యాలయం ఉంది.
నితిన్ గడ్కరీ....
- ప్రకటించిన ఆస్తుల విలువ : రూ. 25.12 కోట్లు
గడ్కరీపై మొత్తం ముగ్గురు కుటుంబసభ్యులు ఆధారపడి ఉన్నారు. హిందూ ఉమ్మడి కుటుంబం(హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ-హెచ్‌యూఎఫ్)కి ఈయనే కర్త.
2017-18కి దాఖలు చేసిన ఐటీ రిటర్నులలో రూ.6.40 లక్షల ఆదాయం ప్రకటించారు. అదే కాలానికి ఈయన భార్య ఆదాయం రూ. 39.43 లక్షలుగా తెలిపారు. హెచ్‌యూఎఫ్ కర్త హోదాలో 2017-18 సంవత్సరానికి రూ. 8.75 లక్షల ఆదాయం ప్రకటించారు.
వేరు వేరు బ్యాంకులలో రూ.8.99 లక్షల పొదుపు ఉంది. డెట్, షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో మొత్తం రూ.3.55 లక్షల పెట్టుబడులు ఉన్నాయి.
గడ్కరీకి పుర్తి పవర్ అండ్ షుగర్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. కోఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీలో షేర్లు ఉన్నాయి.
రుణాలు, అడ్వాన్స్‌లు, ఇతర పెట్టుబడులు, ఇతర ఆస్తులలో రూ. 14.81 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.20.10 లక్షల విలువ చేసే వాహనాలు ఉన్నాయి. నగలు లాంటి విలువైన వస్తువుల్లో రూ.21.83లక్షల పెట్టుబడులు ఉన్నాయి.