1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంతకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే రాజ్యాంగ నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. రాజ్యాంగం గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు...
తయారీకి అయిన ఖర్చు..
రాజ్యాంగంలో చేర్చాల్సిన అంశాలపై అధ్యయనం చేసేందుకు సభ్యులు వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ ప్రక్రియ మొత్తానికి అప్పట్లో రూ.64 లక్షల ఖర్చయింది.
దస్తూరి
రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో ప్రేమ్‌బెహారీ నారాయణ్ రైజదా అందమైన దస్తూరీలో ఇటాలిక్ ఫాంట్‌లో రాశారు. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అందుకు బదులుగా ప్రతి పేజీలో తన పేరు, మొదటి పేజీలో తనతోపాటు తన తాత పేరు రాసుకోవడానికి అనుమతి కోరారు.
తొలి ప్రతి
రాజ్యాంగం తొలి ప్రతిని డెహ్రాడూన్‌లో ప్రచురించగా... ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా సమకూర్చింది.
ఎంత మంది సంతకాలు చేశారంటే?
హిందీ, ఆంగ్లంలో తయారైన రెండు రాజ్యాంగ ప్రతులపై రాజ్యాంగ పరిషత్‌లోని 299 మంది సభ్యుల్లో 284 మంది సంతకాలు చేశారు. మిగిలిన 15 మందిలో ఒకరు మృతి చెందగా, మరొకరిని తొలగించారు. 13 మంది తుది భేటీకి రాలేదు.
- రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నుకున్న రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో జాతిపిత మహాత్మాగాంధీ లేరు.
- రాజ్యాంగం ఆంగ్ల ప్రతిలో మొత్తం 1,17,369 పదాలున్నాయి.
- భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు (ఐరావతం). దీనినే తర్వాత మన దేశ వారసత్వ జంతువుగా గుర్తించారు.
పదిలం
రాజ్యాంగం హిందీ, ఆంగ్లం మూల ప్రతులను పార్లమెంటు గ్రంథాలయంలో హీలియంతో నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. హీలియం వాయువు ఇతర పదార్థాలతో రసాయన చర్యలకు గురవదు. దాంతో అందులో భద్రపరచిన వస్తువులు ఎన్నిరోజులైనా పాడవకుండా కొత్తవాటిలాగే ఉంటాయి.