కొయ్య బొమ్మలంటే తడుముకోకుండా చెప్పేపేరు కొండపల్లి. ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి కూడా! దిలావర్ భాయ్ వీధిలో రంపపు కోతల నడుమ ఎన్నో చెక్కవస్తువులు ప్రాణం పోసుకుంటాయి. ఎలాంటి కలపైనా ఇక్కడో అందమైన ఆకృతి దాలుస్తుంది.
ఉదయగిరి కొండకోనల్లోని కలపే.. ఈ హస్తకళకు ముడిసరకు. జడ క్లిప్పులు, ఆట బొమ్మలే కాదు... చెంచాలు, ఫోర్క్‌లు, కంచాలు, ట్రేల వంటి గృహోపకరణాలు... ఎంతైనా కొనేద్దాం అనేంతలా ఆకర్షిస్తాయి.
ఈ కుటీర పరిశ్రమకు పెద్ద దిక్కు గౌసియా బేగం. తన తండ్రి వారసత్వంగా అందించిన ఈ కళను ముందుకు తీసుకెళ్తున్నారామె . 15 ఏళ్లుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. తాను బతుకుతూ కళనూ బతికిస్తున్నారు.
ఇంతకు ముందు మా నాన్న చేస్తుంటే ఇవి చేయాలని మాకూ ఆసక్తి కలిగింది. నాన్నకు ఆరోగ్యం బాగోక పోవటం వల్ల మిగిలిన మహిళలు అందర్నీ తీసుకొచ్చి ఈ పని చేసుకుంటున్నాం. నెర్ది, కలివి, బిక్కి, దేవధారి... ఈ నాలుగు రకాలతో చెక్క చేసి, ఇంతకు ముందు 50 డిజైన్లు చేసే వారం. ఇప్పుడు 200 డిజైన్లు తయారు చేస్తున్నాం. మంచి మంచి డిజైన్లు చేసి దిల్లీకి తీసుకువెళ్లాము. అక్కడ మా అబ్బాయి జాకీర్‌హుస్సేన్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ పెట్టారు. అది చూసి మోదీ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
-గౌసియాబేగం, కుటీర పరిశ్రమ నిర్వహకురాలు
సుమారు 200రకాల కళాకృతులకు.. ఇక్కడ ప్రాణం పోస్తున్నారు. మదిలో మెదిలిన డిజైన్ అచ్చుగుద్దినట్లు.. చెక్కపై చెక్కేస్తారు. ప్రధాని మోదీ కూడా వీటిని చూసి ఫిదా అయ్యారు. దిల్లీలో జరిగిన హునార్ హట్ హస్తకళా ప్రదర్శనలో వీటి తయారీ విధానాన్ని ఆరాతీశారు.
ఇక్కడ చేసిన సామాను విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, దిల్లీకి పంపిస్తాము. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు వస్తున్నాయి. మిషనరీ ఏర్పాటు చేస్తే పది రోజుల్లో చేసే పని 4, 5 రోజుల్లో చేసి ఇవ్వగలము.