కరోనా నేపథ్యంలో అన్నిచోట్లా భౌతిక దూరం పాటిస్తూ విమానాల్లోపల మాత్రం ప్రయాణికుల్ని పక్కపక్కన ఎలా కూర్చోబెడతారని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విమానయాన సంస్థల ఆదాయం కంటే ప్రయాణికుల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టంచేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి ఉపయోగిస్తున్న విమానాల్లో మధ్య సీట్లలోనూ ప్రయాణికుల్ని అనుమతించడాన్ని ఆక్షేపించింది.
ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం, ఎయిరిండియా.. సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిని జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించింది. రంజాన్ సందర్భంగా న్యాయస్థానానికి సెలవైనా అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ప్రత్యేక విమానాల్లో జూన్ 6 వరకు జరిగిపోయిన బుకింగ్‌ల వరకు మధ్య సీట్లలో ప్రయాణికుల్ని అనుమతించవచ్చని, ఆ తర్వాత మాత్రం బొంబాయి హైకోర్టు ఆదేశాలకు లోబడి నడుచుకోవాలంది.