దంగల్ 2019: పవార్ 'పవర్' ప్లే శరద్ పవార్... 5 దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. 1999లో కాంగ్రెస్‌తో విభేదించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. రక్షణ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలక పదవులు చేపట్టారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
79 ఏళ్ల శరద్ పవార్... మహాకూటమిలో కీలక వ్యక్తి. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేలా అన్ని పార్టీలను ఏకం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థులు ఎవరన్న చర్చ వస్తే... మొదట వినిపించే జాబితాలో పవార్ ముందు వరుసలో ఉంటారు.
ప్రధాని కావాలన్న ఆశ శరద్ పవార్‌కు ఎప్పటినుంచో ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మహాకూటమి ఆలోచన కార్యరూపం దాల్చుతున్న సమయంలో... పవార్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఊహాగానాలు షికారు చేశాయి. ఆ విశ్లేషణలు అన్నింటికీ ఇటీవలే తెరదించారు పవార్. ప్రధాని రేసుకు దూరమని ప్రకటించారు.
అప్పుడలా... ఇప్పుడిలా...
కొద్దిరోజులుగా శరద్ పవార్ చేస్తున్న ప్రకటనలు... రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన అసలు వ్యూహమేంటో అంతుచిక్కకుండా చేస్తున్నాయి.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పవార్ 2012లోనే ప్రకటించారు. 2014 ఏప్రిల్‌లో రాజ్యసభ సభ్యుడయ్యారు. అనూహ్యంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా మాధా స్థానం నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనతో... పవార్ ప్రధాని అభ్యర్థిత్వంపై మరోమారు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతలోనే... పోటీకి దూరమని స్పష్టంచేశారు ఎన్సీపీ అధినేత.
మహాకూటమిని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానని చెబుతూనే... పవార్ చేసిన మరో ప్రకటన చర్చకు దారి తీసింది.
"నా అంచనా ప్రకారం.. భాజపాకు సరైన మెజారిటీ రాదు. కానీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న నమ్మకం లేదు. నేను జ్యోతిష్యుణ్ని కాదు. వాళ్లకు కావాల్సిన మెజారిటీ సంఖ్య లభించదు. అధికారం కోసం భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీకి అవకాశం రాకపోవచ్చు. ప్రధానిగా ప్రజలు కొత్త వ్యక్తిని చూస్తారు."
- శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు
కూటమిలో పవార్ ఎంతో కీలకం. అలాంటి వ్యక్తి భాజపా మరోమారు అధికారంలోకి వస్తుందని చెప్పడం విపక్షాలను తలపట్టుకునేలా చేస్తోంది. మోదీ ప్రధాని కారని అనడం రాజకీయ విశ్లేషకులను ఆలోచింపచేస్తోంది.